Tuesday, July 3, 2018

ప్రేమలేఖ 13

నీకు గుర్తుందా
నిశీధి వేళ వెన్నెల వాన
బొట్లు బొట్లుగా మబ్బుల నుండి రాలిన చినుకులు
పక్కనే కడలి అలల హోరు
ఆ అలల్ని చూసి 'వాన చినుకుల అల' అని కదూ నువ్వన్నది. 
'అచ్చంగా నీలాగే, కొన్నిసార్లు మౌనంగా, మరి కొన్నిసార్లు హోరుగా హొయలు పోవడం అలలకే చెందింది'
అని నేనంటే ఎప్పటిలాగే ఓ నవ్వు విసిరావు.
అట్లా నవ్వడం నీకే చెల్లింది. 
సూర్యుణ్ణి చూస్తూ తిరిగే పొద్దు తిరుగుడు పువ్వు నవ్వు. నెలవంక నవ్వు. పెదాలను సింగిడిగా మలచిన వాన వెలిసిన నవ్వు. 
ఎట్టా నవ్వుతావు అట్లా. ఎద లోతుల్లో ఉన్న ప్రేమను ఏకకాలంలో పెదాలు, కనుల మీదికి  తీసుకువచ్చి. విప్పారిన ఆ కళ్ళని, అరవిరిసిన ఆ పెదాలని ఆ క్షణం ప్రపంచాన్ని మైమరచి చూస్తాను. నవ్వు విసిరేసి. వెన్నెలను చూపించి. అలల్లో ఆడించి. సీతాకోకచిలుకలా ఎగిరిపోతావు. మళ్ళీ నువ్వు వచ్చేవరకు పుప్పొడిని దాచుకునే పువ్వులా ఎదురుచూస్తాను. కొన్నిసార్లు గాయపడి వస్తావు. తెగిన రెక్కతో కన్నీళ్లతో వస్తావు. గాయాలకు మందు రాసుకొని, రెక్కలు కుట్టించుకొని, కాసేపు ముద్దు చేయించుకొని ఎప్పటిలాగే మళ్ళీ ఓ నవ్వు విసిరి వెళ్లిపోతావు.

నువ్వు నవ్వును అలా పెదాల, కనుల కొస నుండి విసిరిపోయాక ఇంకాసేపు అలాగే ఉండిపోతే బాగుండు, వీలైతే సర్వ కాలలందు, సర్వ సమయాలందూ అట్లాగే ఉండిపోతే బాగుండు అనుకుంటాను. వెన్నెలని చూస్తో. చుక్కల్ని లెక్కిస్తో. వాన చినుకుల్లో తడుస్తో ఉండిపోదాం అనుకుంటాను. సీతాకోకచిలుకవి కదా. స్వేచ్ఛగా ఎగిరిపోతావ్.
సీతాకోకచిలుకను అనుకున్నప్పుడు వాటి రెక్కలు కత్తిరిస్తున్న కాలంలో బతుకుతున్నాం అని గుర్తొస్తుంది.  బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు అంటూ రెక్కలను కట్టేస్తున్న కాలం యాదికి వస్తుంది. ఎన్ని రంగుల సీతాకోకచిలుకలు వంట గదిలో మాడి మాడి నల్లరంగు ఒంటికి పులుముకోలేదు. సిలిండర్లు పేలి? నల్లగా మాడి పోలేదు. ఏది సీతాకోకచిలుకల సవ్వడి. తుళ్ళుతూ తిరిగే రంగురంగుల సీతాకోకచిలుకలు ఏవి. మొఖాలకు ప్లాస్టిక్ నవ్వుల్ని పూసుకుని తిరుగుతున్నాయి. ఎదలోతుల్లో బాధను ఉంచుకొని, కనురెప్పల మాటున సంద్రాన్ని దాస్తున్నాయి. ఎవరు చిదిమేశారు వాటి స్వేచ్ఛను?! ఈ మగోన్మాదం కదూ. వీడి విచ్చలవిడి తనం stud గా, వాటి స్వతంత్ర్య ప్రకటన bitch గా ముద్ర వేసింది ఈ మగ వ్యవస్థ కదూ. Feminism అంటే 'సమానత్వం కోసం జరిగే పోరాటం' అని గాక, 'ఆడ పెత్తనం' అన్న మగ వెధవ ఎవడు. వాడు కచ్చితంగా తాటక ముక్కు, చెవులు కోసినవాడి వారసుడో, పాలిస్తున్న పూతన చన్నుల నుండి రక్తం తాగి మరీ చంపిన వాడి వారసుడో అయి ఉంటాడు. ఈ దేశంలో వాళ్లే కదా తలలకు వెలలు కడుతూ గోడపత్రికలు అంటిస్తున్నది. బయటకి వచ్చిన సీతాకోకచిలుకలు వేటాడబడతారు అని వాఖ్యానిస్తున్నది.
సీతాకోకచిలుక ఎగరడం చూస్తుంటే ఎంత బాగుంటుంది. ఒక్కటి ఎగురుతుంటే చూసి చిన్నప్పుడు గంతులు వేసేవాళ్ళం. అదే రంగురంగుల సమూహం అయితే ఆ ఆ ఆనందానికి అంతెక్కడిది. కొన్నిసార్లు కాసేపు దాన్ని పట్టుకొని మళ్ళీ వదిలేసే వాళ్ళం. అది మళ్ళీ దొరకకుండా పోయేది. దాని రాకకోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం. ఆ ఎదురుచూపులో ఓ ఆనందం ఉంది. అయితే సీతాకోకచిలుకకు దారం కట్టి హింసించే పసి కౄరత్వమూ సమాజంలో ఉంది. బాల్యంలోనే స్వేచ్ఛను వాళ్లకి అర్థం చేయించకపోతే సీతాకోకచిలుకల్ని చిదిమెసే యవ్వనులు అవుతారు. ఆ యవ్వనుల వికృత క్రీడను చూస్తూనే ఉన్నాం. చదువుతూనో, వింటునో ఉన్నాం.
ప్రియమైన సీతాకోకచిలుక నువ్ రెక్కలు కట్టుకొని కాదు, రెక్కల బస్సు ఎక్కి పోయావ్. నువ్ నవ్వుతూ ఎగరడం చూడడంలో ఓ ఆనందం ఉంది.  ఎక్కడ పడిపోతావేమో అనే భయంలో చెప్పలేనంత ప్రేమ ఉంది.  నీ రాకకై చూసే ఎదురుచూపుల్లో వచ్చే జ్ఞాపకాల్లో ఏదో గ'మ్మత్తు' ఉంది. అందుకే ఈ నిశి రాతిరి వెన్నెల వేళ నీ జ్ఞాపకాలను కలబోసుకుంటూ రాస్తున్న లేఖ.

No comments:

Post a Comment