Wednesday, July 25, 2018

ప్రేమలేఖ 15

పదాలకు ఇమడకుండా,
మాటల్లో చెప్పలేని కొన్ని భావాలుంటాయి. నువ్ కనులతో పలికించినట్టు. నా ఎదపై మోపిన నీ పాదాలను ముద్దాడినట్లు.
ఇప్పుడు అంతే ఏం రాయాలి. రాయడం మొదలెడితే ఎంతని రాయాలి. జ్ఞాపకాల్ని అక్షరాల్లో కలబోసుకోనా! ఊసుల్ని పదాల్లో కూర్చనా! ఆనంతానంతా ప్రేమను వాక్యాలుగా చేసి ప్రవహింపజేయనా! వాక్యాలన్నీ ప్రవహించి ప్రవహించి ఏదో ఓ రోజు సంద్రమవుతాయి. వాక్యాల సంద్రంలో జ్ఞాపకాల లోతులుంటాయి. గాయాలుంటాయి. తిరుగుబాటు పాటలుంటాయి. కింద పడ్డ ప్రతిసారీ మళ్ళీ నిటారుగా లేచి నిలబడ్డ ధిక్కారం ఉంటుంది. స్వాభిమాన ప్రకటనలు ఉంటాయి. నువ్వుంటావు. నేనుంటాను. మనంగా బతికిన కాలం ఉంటుంది. ఎడబాటు, కన్నీళ్లు, వలపోతలు ఉంటాయి. ఎప్పటికిలాగే కలలకై మనం చేసే ప్రయాణం ఉంటుంది. కలసి కన్న కల ఉంటుంది. కలసి కనాలకున్న కల చెదిరిపోయిన విషాద జ్ఞాపకంగా ఉంటుంది. నవ్వుతూ, లేడిపిల్లలా గెంతుతూ కళ్లముందుకు వచ్చిన అల్లరి పిల్ల 'కల' ఉంటుంది. ఎందుకో ఇవన్నీ చెప్పాలనిపించినపుడు చెప్పుకోవడానికి నువ్వుండవు. దూరంగా ఎక్కడో ఉంటావ్. ఎప్పుడు వస్తావో తెలియదు. కానీ మళ్ళీ వస్తావనే నువ్ ఇచ్చిన నమ్మకం, చూడమన్న ఎదురుచూపు ఇంకా నాతోనే ఉంది. ఉంటుంది. అది గొంతులోకి దిగిన హబ్సన్ మత్తులా ఉంది.

నీకు రాద్దాం అని కూర్చోగానే ఎందుకో కీట్స్ గుర్తొచ్చాడు. కీట్స్ తన ప్రేయసికి రాసిన లేఖ గుర్తొచ్చింది. చదువుతుంటే, కీట్స్ పోయెమ్ ఒకటి గుర్తొచ్చింది.
"Pillow'd upon my fair love's ripening breast,
To feel for ever its soft fall and swell,
Awake for ever in a sweet unrest,
Still, still to hear her tender-taken breath,
And so live ever—or else swoon to death." ఈ కవిత పాదాలు నిన్ను ఇంకా ఇంకా మిస్ అవుతున్న అని గుర్తుచేశాయ్. నిజంగానే ఏదో sweet unrest ఎదను తొలుస్తుంది. అయితే అది కీట్స్ అన్నంత swoon to death స్టేజ్ కి ఇంకా రాలేదు.

చరిత్రలో కొన్ని తేదీలు మర్చిపోలేం. కొన్నిసార్లు కావాలని మర్చిపోయినట్టు నటిస్తాం అంతే. అవి అట్లా ఉండిపోతాయ్. ఎంతకీ తుడిచిపెట్టుకుపోని జ్ఞాపకంగా.  ఆ తేదీల చుట్టూ అల్లుకున్న గడచిన అందమైన క్షణాల్లా. కొన్ని తేదీలు పురాస్మృతులు కాదు. వెన్నాడే జ్ఞాపకాలు. మరికొన్ని చక్కిలిగింతల చిరునవ్వులు. మెడఒంపును తాకిన వెచ్చని నిచ్వాసలు. చలికాలపు వెచ్చని, ఎండకాలపు చల్లని రాత్రులు.

No comments:

Post a Comment