Monday, July 16, 2018

ప్రేమలేఖ 14

ఓయ్ పిల్లా. నిన్న కల్లోకి వచ్చావ్. రోజు ఇదే చెప్తావు అంటావు. 'sex with love, sex without love' మీద ఓ రాత్రంతా మాట్లాడుకున్నాం గుర్తుందా. అదేనోయ్ 'నీళ్లు, గ్లాసు సిద్ధాంతం'. నిన్న ఓ సినిమా చూశాక ఎందుకో ఆ చర్చ గుర్తొచ్చింది. ఆ చర్చ, నీళ్లు గ్లాసు సిద్ధాంతం కన్నా రాత్రుల్ని 'ధార'పోసిన వాడ యువకులు వెంటాడారు.
ఇందు అనే గడి గావురాల పిల్ల. సిక్స్ ప్యాక్ యువకుణ్ణి చూసి ప్రేమ?లో పడుతుంది. ఓ రోజు అతన్ని ఇంట్లోకి లాగి గోడకు అదిమి ప్రేమిస్తున్నాని చెప్తుంది. వాళ్లిద్దరూ చెట్లేెంబడి, పుట్టలేంబడి పడి ప్రేమించుకుంటారు.  అమ్మాయి ఇంట్లో ఎవరూ లేకపోతే పిలుస్తుంది. అక్కడ అంతే they make love. Or love makes them. ఓ రోజు ఆ పిల్ల ఇంట్లో మన విషయం చెప్తా అని పోతుంది. నువ్వు వెళ్ళు అని హీరో వాళ్ళ డాడీని పంపిస్తాడు. తెల్లారి హీరో లేచేసరికి యాక్సిడెంట్ అయి డాడీ హాస్పిటల్ లో, ఇందుకి వాళ్ళింట్లో నిశ్చితార్థం. హీరో పోతాడు. ఇందు వాళ్ళ అయ్యా తంతాడు. హీరోని బంధించి ఇందుకి పెళ్లి చేస్తాడు. అంతే అమ్మాయి అమెరికా, మనోడు  గంజాయి తాగుతూ, గడ్డం పెంచుకుని, ఆమె ఏడాబాటులో కలిగిన విరహంలో ఇక్కడ. ఇక్కడి వరకు మన చర్చకు,రాత్రుల్ని 'ధార' పోసిన వాడ యువకులు యాది రావడానికి సంబంధమేమి లేదు.
మూడేండ్ల తరువాత ఆ పిల్ల అమెరికా నుండి తిరిగి ఇంటికి వస్తుంది. హీరో పోయి తనతో రమ్మంటాడు. తాను రానంటుంది. మీ నాన్నకి భయపడుతున్నావ్ అంటాడు.  పెద్ద గొడవ. కట్ చేస్తే. హీరో వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని పోతాడు. ఊరోదిలి పోదాం అంటాడు. అప్పటివరకు ఎక్కడికి పోకుండా ఓ గదిలో బంధిస్తాడు. 'ఎప్పుడు ఆ పిల్ల గురించే గాక, వీడి గురించి కూడా ఆలోచించు డాడీ' అని దోస్తు అంటే 'ఆ పిల్ల వీణ్ణి ప్రేమించలేదు. వాడుకొని వదిలేసింది. వీడు దాన్నే ప్రేమ అనే భ్రమలో ఉన్నాడు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి భయపడి పెళ్లి చేసుకొని పోలేదు. తానే ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయమని అడిగింది' అని చెప్తాడు. ఆ పిల్ల భర్త వస్తున్నాడని, హీరోని అతడు వెళ్లిపోయే వరకు కనపడకుండా చేయమని ఇందు తండ్రి తన శత్రువునే అడుగుతాడు. ఆ విషయం తెలిసిన ఇందు కనపడకుండా చేయడం కాదు, చంపమని సుపారి ఇస్తుంది. రౌడీల విచ్చుకతుల వేటలో గాయపడి, తనని చంపమన్నది ఇందు అని తెలుసుకుని దేహమే కాదు, హృదయమూ గాయపడి తన దగ్గరికి వస్తాడు. తనని చంపాలనుకొని గొంతు నులిమి వదిలేస్తాడు. సూక్ష్మంగా ఇది కథ.
ఈ కథ దాదాపు చాలా ఊర్లలో జరిగేదే. ఊర్లలో అనడం కన్నా ఊరికి, వాడికి మధ్య జరిగేది అంటే బాగుంటుంది. హీరో డాడీ అన్నట్లు 'నీకు వాడుకోవడానికి మొరటోడు కావాల్సి వచ్చింది. పెళ్లికి మాత్రం సాఫ్ట్ గా ఉన్నోడు కావాలా?' ఈ మాట చాలా పల్లెల అనుభవం. దొర్సాని, కామాంధు కూతురు సర్వనామమే. కోటేశులు ఇందులో శివలాగా సర్వనామమే. Rarest of the rare cases అన్నట్లు చాలా అరుదుగా ఊరి తండ్రి తన బిడ్డది తప్పు అని ఒప్పుకుంటాడు. ఈ సినిమా కథలో నిజంగా ఒప్పుకున్నాడా!? సినిమాటిక్ సన్నివేశం కోసం తీశారో తెలియదు. ఇందు తండ్రి తన కూతురుది తప్పు అని ఒప్పుకుంటాడు.
Tongue can be lie but eyes can't అన్నారెవరో. నిజంగా ప్రేమిస్తే కళ్ళలోకి చూస్తే తెలుస్తుంది అన్నారు ఇంకెవరో. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. కానీ గుండెల్లో ప్రేమనంతా కళ్ళలోకి తీసుకొచ్చి నువ్ ఒక చూపు విసురుతావ్. వెళ్తున్నప్పుడు ఎడబాటును  అంతే, మాటల్లో గాక చూపులోనే చెప్తావ్. ఆ పిల్ల అంతలా వాడ్ని తన కళ్ళతోనే మాయ చేసింది. కాకపోతే కళ్ళనిండా కామకాంక్ష. ఆ కామాన్ని అతడు ప్రేమనుకున్నాడు. తాను అలాగే నమ్మించింది.
ఈ దేశంలో దోపిడీకులాల కామవాంఛలు తీర్చుకొనేందుకు ఎక్కువగా వాడిన ఆయుధం ప్రేమ. చాలా అరుదుగా ఊరు, వాడ మధ్య విరబూసిన ప్రేమను తెగనరికెందుకు ఎన్ని ప్రయత్నాలు జరుగలేదు.అయ్యలకు భయపడి, వాడే నా చెయ్యిపట్టి లాగాడు అంటే ఎన్ని తలలు నేల రాలలేదు. ఈ సినిమా చూశాక ఏదో వెంటాడుతుంది. వెంటాడుతున్నది ఏమిటా అని వెతికితే అది వెలి ప్రేమ. అంటరాని ప్రేమ. పాలెర్లను బలి పశువులను చేసిన వెలిప్రేమ. అమ్మాయిలను చిదిమేసిన అంటరాని ప్రేమ.
వచ్చాక ఓ కవిత రాసుకున్న.
శీర్షిక: అంటరాని ప్రేమలేఖ
అమ్మాయిగోరు
గడి గావురాల దొర్సాని
మీరు మీద మీదకచ్చి పడుతాంటే
గళ్లపట్టి మీదకు గుంజుకుంటే
కండ్లల్ల కండ్లు పెట్టి పానం
నీళ్ల లెక్క తోడుతాంటే
ప్రేమే అనుకున్న

దొర, పెద్దోర్సాని ఊరికి పోయినప్పుడు
ఇంట్లకు పిలిచి దేహాన్నీ రాజేస్తే
అదిరిన అధరాల సాచ్చిగా
గుండెలో రవుతం అలలెక్క ఎగిరివడ్డది
రాత్రి చేను గట్టుకాడ
రాలిన తంగేడు పూలు
మనకింద పడి నలిగితే
అది ప్రేమకు సాక్ష్యం అనుకున్న
మొగులెనుక ఎన్నెల దాగుంటే
మనకు ఏకాంతం ఇవ్వనీకి అన్నావ్

దొర్సాని
నీకు నేను జేసిన 'ఏకాంత సేవ'
ధార పోసిన కాలం
మనకే తెలుసు

ఊళ్ళ ఎవలకు చెప్పకు అంటే
దొరకు భయపడుతున్నవేమో అనుకున్న
ధోఖ ఇవ్వజూస్తున్నవని తెల్వలే
మోటు దేహపు వాటమే కావాలంటే
ఆశలేమి పెట్టుకోకపోతుంటి కదా దొర్సాని
ప్రేమ అంటివి
దొరకు జెప్పి ఒప్పిచ్చి పెండ్లాడతా అంటివి
అన్ని ఉత్తమాటలేనా దొర్సాని
నువ్వు బీ మీ ఇంటి మొగోళ్ల ఏశాలే ఎస్తివి

మేం ఏశాలు కడుతాం యువరాణి
మా ఏశం పొట్టకూటికి దొర్సాని
హరిశ్చంద్రుడు, వీరబాహుడు, హిరణ్యకశిపుడు, నరసింహుడు ఒక్కటా, రెండా తీరొక్క ఏశం కడతాం
మీలెక్క పానాల్దీసే ఏశం ఎన్నడూ ఎయ్యలే.

నువ్వెంది దొర్సాని
మనువు పేరు చెప్పి 'మనువు' లెక్కే జేసినవ్
నా పానం దీసి పత్తా లేకుండా పోయినవ్
మీకు ప్రేమ పది నిమిషాల 'సుఖం' అయినచోట
మాకు పానం దీసుకునేంత ఇజ్జత్ అయింది
అందుకే దొర్సాని
మేం దూలాలకు ఏలాడుతుంటే
మీరు గాలి మోటార్లలల్లా దేశాలు ఎగిరిపోతుండ్లు

దొర్సాని ఒక్కమాట
మాకు ప్రేమించుడే అత్తది
కథలు చెప్పుడు, ఏశం కట్టుడే అత్తది
మీ లెక్క
కథలు పడుడు, ఏశాలు ఏసుడు రాదు
పాదం కందకుండా
గుండెల మీద పెట్టుకొని సూసుకునుడే అత్తది
గుండెల కత్తులు దింపుడు రాదు

సినిమాను చెప్పాను. సినిమా చూశాక నాకు అనిపించింది చెప్పాను. కానీ ముఖ్యమైంది ఇంకోటి ఉంది. థియేటర్ లో జనాల గోల. ఇందు శివను మోసం చేసింది అని తెలిసినప్పుడు వాళ్లు మాట్లాడిన మాటలు. ఆ పిల్లను తిడుతున్నప్పుడు వాళ్లు వేసిన ఈలలు. ఇందుని శివ డాడీ నిలదీసినప్పుడు, ఇందువాళ్ళ నాన్న అసహ్యించుకున్నప్పుడు, చివర్లో శివ తన అంటరాని మోటు ప్రేమ మరణ వాగ్మూలం చెబుతున్నప్పుడు జనాల ఈలలకు సంభాషణలు వినపడలేదు. ఆధిపత్య మగ జెండర్ ఒక అమ్మాయి అబ్బాయిని మోసం చేయడం ఓర్చుకోలేదు. తనని శివ గోడకు అదిమి గొంతు నులుముతున్నప్పుడు వాళ్ళ కేకల్లో ఆనందం ఓ ఉన్మాదానికి పరాకాష్ట. ఆధిపత్య జెండర్, కులం, మతం తాము అణచివేస్తున్న అస్తిత్వాలు ఎక్కడో తిరగబడ్డాయనో, మోసం చేశాయనో తెలిస్తే తమని కాకపోయినా వాళ్ళ మీద మోసం చేయబడిన వాడికన్న ఎక్కువ కసిగా ఉంటారు. అదే అబ్బాయి మోసం చేసిన అమ్మాయిల సినిమాలు తీస్తే డైరెక్టర్లను తిడతారు. ఇదో రకమైన హిపోక్రసి. ఈ ఆధిపత్య హిపోక్రసి భావజాలం పోనికి ఎన్ని జెండర్ సెన్సిటైజేషన్ క్యాంపులు పెడితే మారతారో వీళ్ళు.
ఆధిపత్య కులం, వర్గం, మతం చేసే దోపిడిలో లైంగిక దోపిడీ ఒక భాగమే. దానికి జెండర్ లేదు. ఇక్కడ ఇందు అనేక రాత్రుల్ని దోచుకున్న వాళ్ళకి ఓ ప్రతీక. శివ దోపిడీకి గురికాబడిన వాళ్ళ ప్రతీక. శివ ఓ కోటేశు. ఆమె కామాంధు. శివ ఓ పాలేరు. ఆమె ఓ దొర్సాని. ఇంతకీ సినిమా పేరు చెప్పలే కదూ 'RX 100'.

No comments:

Post a Comment