Thursday, June 28, 2018

ప్రేమలేఖ 12


నువ్వు  ఈ వార్త చదివే ఉంటావ్. మహిళలకు భద్రత లేని దేశాల్లో ఇండియాది మొదటి స్థానం అంటూ ఓ అమెరికన్ సర్వే కథనం. జనాల గగ్గోలు చూసి నాకు నవ్వొచ్చింది. వినడానికి వింతగా ఉన్నా , నవ్వే వచ్చింది. రాహుల్ సాంకృతయాన్ 'వోల్గా నుండి గంగ' గుర్తుందా. అందులో 'గార్గి' అని ఉంటుంది. తానొక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేక 'గార్గి నీ శిరస్సు నేలకూలిపోతుంది, ఇక మీదట ప్రశ్నించావంటే' అని యజ్ఞవల్కుడు బెదిరించి ఆమెతో వాదం గెలుస్తాడు.  తరువాత గార్గి తన అత్తతో చేసే సంభాషణ గురించి మాట్లాడుకున్నాం. ఆ సంభాషణ మాతృస్వామ్య వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థగా మారుతున్న సందర్భంలోనిది. అత్త గార్గికి చెప్పిన మాటలు గుర్తున్నాయనుకుంటా. 'అక్కడే మహిళపై పురుషుని పెత్తనం మొదలయింది' అని కదూ నువ్వన్నది. అంతేకాదు 'బ్రాహ్మణ, క్షత్రియ కుట్ర అక్కడే మొదలైంది' అని కదూ మాట్లాడుకుంది.

ఆరోజు గార్గి ఇంకా మాట్లాడి ఉంటే తన తల తెగిపడి ఉండేది. గార్గి అత్త అన్నట్టే, 'యజ్ఞవల్కుడి బ్రహ్మతేజస్సు వల్ల మాత్రం కాదు. ప్రపంచంలో నిశ్శబ్దంగా మొండెం నుండి వేరు చేయబడుతున్న తలల్లాగే'. ఆ రోజు గార్గి ఎందుకు ఆగిందో కానీ బతికి పోయింది. ఇప్పుడు గార్గిలు ఉన్నారు. ప్రశ్నిస్తున్నారు. యజ్ఞవల్కుడిలా 'శిరస్సు నేల రాలుతుంది'  అనట్లేదు. 'దీని మానం తియ్యాలి అంటున్నారు. యోనిలో సీసాలు జొప్పియ్యాలి అంటున్నారు.' నడుస్తున్న కాలంలో గార్గి ఇప్పుడు బరితెగించి మహిళ.

కోరి వచ్చిన మహిళ ముక్కు, చెవులు తమ్ముడితో కోయించిన 'దుర్మార్గుడు' ఈ దేశంలో దేవుడు. పెండ్లాన్ని అడవికి పంపిన వాడు. అటువంటి వాడే భర్తగా రావాలి అని సగటు మహిళ కోరిక. అది వింటుంటే జుగుప్సాగా ఉంది. స్నానం చేస్తున్న అమ్మాయిల బట్టలు ఎత్తుకపోయి చెట్టు మీద కూచొని, నగ్నంగా నడచివస్తే తప్ప బట్టలు ఇవ్వను అన్నవాడూ దేవుడే. మారువేషంలో పోయి అహల్యను బలాత్కరించిన వాడు దేవుళ్ళకి అధిపతి. అయ్య చెప్పిండని తల్లిని నరికినవాడు ఆదర్శప్రాయుడు. గుర్రంతో భార్యని రమింపచేయడం ఒక యాగం. నడి బజారులో పందిరి వేసి మరి రమించడమూ యాగమే. ఇందులో మొగుడికి స్వర్గంలో దేవవేశ్యల ప్రాప్తం కలుగుతుంది. ఎందుకో భార్యకే యే ప్రాప్తం లేదు. ఇవి పురాణాలుగా, ఇతిహాసాలుగా చదువుకున్న దేశం మహిళల పట్ల ఎట్లా ఉంటుందో ఊహించడం కష్టం యేమి కాదు. మనం కళ్ళముందు జరుగుతున్నదే. ''ఆడ'ది కదా! ఎట్లా రాత్రి తిరుగుతుంది. తిరిగితే, ఇట్లాంటి బట్టలు వేసుకుంటే రేపులు జరగవా!' ఇవి మనం రోజూ వింటున్న మాటలే. 'బరితెగించింది. విచ్చలవిడిది. బిచ్.' ఇవి ఇప్పుడు గార్గి సర్వనామాలు.

గార్గి మొదలు ఇప్పటిదాకా మహిళ ఓడించబడుతూనే ఉన్నది. అయినా తిరగబడుతూనే ఉన్నది. 'ఈ మోసాన్ని ద్వేషించడానికి మానవహృదయం మనకిక ప్రొత్సాహమివ్వదా?' అని గార్గి అడిగినట్లే అడుగుతూనే ఉన్నది. 'ఇస్తుందమ్మా! అదే నాకున్న ఆశల్లా.' అని అత్త ఇచ్చిన సమాధానం 108 తరాలుగా (రాహుల్ రాసిననాటికి) ఇంకా ఆశగానే ఉన్నది.

No comments:

Post a Comment