Sunday, June 24, 2018

ప్రేమలేఖ 11

ఈ రాత్రి ఎందుకో దుఃఖాన్ని రాయాలి అనిపిస్తుంది. తరతరాలుగా ఒడువని దుఃఖాన్ని.  ఎడతెరిపిలేని అవమానాల తాలూకు గాయాల వలపోతల దుఃఖాన్ని.  వెన్నెల రాత్రులు కలయికలు కాస్తా, పొద్దు పొడవగానే 'అమ్మగారు' అని పిలిచినప్పుడు కనుకొలకుల్లోంచి కారిన దుఃఖాన్ని. ఈ దేశం వాడకి బాకీ పడ్డ దుఃఖాన్ని. నీకు గుర్తుందా. ఓ రోజు ఒక లైన్ ఆర్ట్ చూపించాను. ఆంగ్లంలో వాక్యాలు సరిగ్గా గుర్తులేవు. 'ఈ రాత్రి మన ప్రేమాగ్నిలో మనువు కాలిపోయాడు' ఈ వాక్యాలు రాయాలి అనిపించింది. ఆ ఆర్ట్ చూశాక.  ఆ ఆర్ట్ మీద ఎంత మాట్లాడుకున్నాం. 'వెన్నెల రాత్రి. చెరువు గట్టు. చెట్టు కింద. ఎంత అందమైన దృశ్యం అది. అట్లా అని అది Outdoor పోర్న్ కాదు. ఈ దేశం. దీనికే పరిమితం అయిన కులం. అది విధించిన కట్టుబాట్లను దాటిన, కాదు కాదు కూల్చిన చిత్రం అది' అని కదూ మాట్లాడుకుంది. కంచికచర్ల కొటేశును కదూ యాది చేసుకుంది.
కంచికచర్ల కొటేశు సర్వనామం. ఎంత మంది కోటేశుల జీవితాలు రాత్రి, పగలుకు తేడా చెప్పాయి. రాత్రి మనసు, దేహం ఇచ్చిన అమ్మాయిని పొద్దున్నే 'అమ్మగారు' అని పిలవడం ఎంత విషాదం. ఊరు మోపిన నేరానికి ఆ అమ్మాయే సాక్ష్యం అయితేనే కదా కోటేశులు రైలు పట్టాల మీద ముక్కలయ్యి, చెట్లకు కట్టిన ఉరితాళ్లకు ఏలాడి, కాలిపోయి, బాయిలో మునిగిపోయి చితులమీద దేహాలయ్యేది.  అబ్బాయిగార్లు నిర్ధాక్షిణ్యంగా వదిలేసిపోతారు. అప్పుడు వాడ సునీతై కదూ ఉరి పోసుకునేది. ఎందుకో ఇయ్యాల దుఃఖాన్ని రాయలనుకుంటే కోటేశులు, సునితలు యాదికచ్చారు. ఇంత కన్నా దుఃఖం ఇంకేం ఉంటుంది. నీ ఏడబాటులో కలిగిన దుఃఖాన్ని దీనితో పోల్చుకున్నాను. నా మీద నాకే నవ్వొచ్చింది.
చివరి వాక్యాలు చదివి నువ్వూ నవ్వుకుంటావ్ అనుకుంటా.

No comments:

Post a Comment