Thursday, April 9, 2020

మై ఔర్ మేరీ తన్హాయి

 బతుకెప్పుడో చీకటి గదిలో ఒంటరయ్యాకా, నన్ను నేనే వేసుకున్న వెలి అయ్యాకా కొత్తగా క్వారంటయిన్ చేసేదేముంది. ఇప్పుడూ అదే ఆంక్ష. అత్యవసరమైతే తప్పా బయట అడుగిడొద్దని. నే రాతిరి ఉఫోరియా తాలూకు గాఢనిదురలో ఉన్నప్పుడు ఏ ఇజాజత్ లేకుండా, మాటైనా చెప్పకుండా నువ్వొదిలేసి వెళ్ళిపోయాక నషా కోసమో! నిషా కోసమో! తప్పితే, అడుగు బయట పెట్టిందెప్పుడనీ? బతుకే క్వారంటాయిన్ అయ్యాకా యాదుల్ని లెక్కెడుతూ మనాది పడటం తప్ప ఇంకా ఏమి మిగిలిందని. 

ఇదిగో... ఈ చీకటి గదిలో నన్ను నేనే బంధిచుకున్నాకా లోకమంతా మర్కజ్ పోతే నాకేమీ? లోకమే మరీజ్ అయితే నాకేమీ? అనే అనుకుంటాను కొన్నిసార్లు. కానీ,
"గాలిబ్ కె మొమిన్ కి ఖ్వాబోన్ కి దునియా
మజాజో కే ఉన్ ఇంక్విలాబోన్ కి దునియా
ఫైజ్ ఏ ఫిరాఖ్ ఓ సాహిర్ ఓ మఖ్దూమ్ మీర్ కి జౌఖ్ కి దాఘోన్ కి దునియా" అంటూ పీయూష్ మిశ్రా చెవుల్లో హోరెత్తుతాడు. ఇంత అందమైన దునియాను 'తుమ్హారి హైతో తుమ్హే సంభాలో' అని ఎట్లా వొదిలేసేది? అందుకే ఆకలి, దప్పుల, కలల చీకటి దునియాకు వెలుతురును కాంక్షిస్తూ నాలుగు అక్షరాలు రాసి పంపుతాను. 

ఈ చీకటి గదిలోకీ, బతుకులోకీ అప్పుడప్పుడూ దేహమే ఒక మత్తై, దేహమే ఒక వెంటాడే పరిమళమై, మధుపాత్రతో ఓ సాకీ నడిచొస్తుంది. కాసేపు ఉండి, మధుపాత్రను గొంతులోకి ఒంపి, గదినిండా మత్తునూ, తన దేహపు పరిమళాల్ని వొదిలి వెళ్తుంది. మళ్లీ ఇదే గది. గదినిండా పరచుకొని ఇదే చీకటి. పగిలిన పెదాల మీద మృతచర్మాన్ని లాగుతో నేను.

నీ యాదుల లోతుల్లో దిగబడి 'మేరా కుచ్ సామాన్ తుమ్హారా పాస్ పడా హై' అనుకుంటూ మై ఔర్ మేరి తన్హాయి మాట్లాడుకునే మాటలు.

Sunday, March 29, 2020

అమ్మ రాతిహృదయం

రెండు హృదయాలు
నాల్గు కన్నులు
దివారాత్రులంతా 
ఏడుస్తూనే ఉన్నాయ్

ఆ నల్లని కనులు ఏడుస్తోంది
ఇక కలవలేమనీ
కలిసుండలేమనే

నిషేధించింది మా అమ్మ
నేనా పిల్లవాన్ని ప్రేమించడాన్ని
బహుశా
ఆమె హృదయం
రాతితో చెక్కబడిందేమో
అతడ్ని ప్రేమించొద్దని చెప్పేందుకు


నిషేధించింది మా అమ్మ
నేనా పిల్లవాన్ని ప్రేమించడాన్ని

కానీ,
నేనతన్ని గట్టిగా హత్తుకుంటా
అతడ్ని ప్రేమిస్తూనే ఉంటా
నా ఊపిరాగే చివరిదినం దాకా

అవును
అతడ్నే ప్రేమిస్తా
నా బతుకు ఆఖరి క్షణం దాకా

Monday, December 16, 2019

మూడు మాటలు

ఒకప్పుడు ఇక్కడ మనుషులుండేవారు
మానవత్వమూ ఉండేది.
ఇప్పుడు వారు మతమయ్యారు
మారణ హోమమయ్యారు

హోమగుండం ఎప్పుడూ 'బలి'నే కోరింది
శంబుకుడు
బర్బరికుడు
ఇప్పుడు సర్వనామాలయ్యారు
వాళ్ళ నెత్తురు
నేతిగా 
హోమగుండం మండింది
మంటల్లో మాడిన దేహం
విప్రుల 'గో'విందయింది

చరిత్రను సా(రీ)వర్కర్ లు 
వీర+ఓచితంగ రాస్తున్నారు
గోబెల్స్ లు ఇదే నిజమని
యూనివర్సిటీ సిలబస్ లో పెట్టారు

మనువు
రాజధాని నడి వీధుల్లో
ఆరక్షరాల నిరసనపై
లాఠీ నృత్యం చేస్తున్నాడు
టియర్ గ్యాసై పేలుతున్నాడు

చేతులు తెగి
కళ్ళు పోయి
కమిలిన దేహంతో
రాజ్యాంగం రోడ్డున పడి
విలపిస్తోంది

అవును
రాజ్యాంగం
విలపిస్తోంది

*
ఎదకు పుస్తకాన్నద్దుకొని 
పిడికిలి బిగించి వస్తున్నారు
వస్తుందొక సమూహం 

వాళ్లే రేపటి ఆశ

Educate
Agitate
Organise

Study
Struggle
Liberate

Saturday, August 31, 2019

నిన్ను మళ్లీ కలుసుకుంటాను

నిన్ను మళ్లీ కలుసుకుంటాను
- అమృత ప్రీతమ్

నిన్ను మళ్లీ కలుసుకుంటాను
ఎప్పుడూ? ఎక్కడా? నాకూ తెలియదు.
నీ కల్పనలకు  ప్రేరణయ్యి
బహుశా నన్ను నే ఓ నిగూఢ గీతలా
నీ కాన్వాస్ పై పరచుకొని
నిన్ను చూస్తూనే ఉంటాను

నేనో సూర్యకిరణాన్నై
నీ రంగుల్లో కలిసిపోతాను
నీ రంగుల్ని కావలించుకొని
నన్ను నీ కాన్వాస్ పై చిత్రించుకుంటాను
నాకూ తెలియదు
ఎప్పుడూ? ఎక్కడా? అని -
కానీ నేను నిన్ను తప్పక కలుసుకుంటాను

బహుశా నేను వసంతంలా మారి
నీ దేహంపై నీటి నురగను రుద్దుతాను
నీ దహించే ఎదపై
కాస్త చల్లదనాన్ని అద్దుతాను
నాకేమీ తెలియదు
కాలం ఏం చేసినా
జీవితం నా వెంట నడుస్తూనే ఉంది

దేహం నశించినప్పుడు
అన్నీ నశిస్తాయి
కానీ జ్ఞాపకాల పోగులు
కాల గమనంలో అల్లుకుపోయి ఉంటాయి
వాటిని ఏరుకుని
ఆ పోగులను అల్లుకుంటూ
నిన్ను మళ్లీ కలుస్తాను

ఎప్పుడూ? ఎక్కడా?
నాకూ తెలియదు
కాని నిన్ను తప్పక కలుస్తాను

అనువాదం: అరుణాంక్ లత
నేడు అమృత ప్రీతమ్ శత జయంతి

Saturday, August 17, 2019

మేరా కుచ్ సామాన్


యే ఇజాజత్ లేకుండా నడి నిద్రలో నన్నొదిలిపోయిన పిల్లా. నా సామాన్లు కొన్ని ఇంకా నీ దగ్గరే పడున్నాయ్. నదీ తీరపు నడకలు మొదలు సముద్ర తీరపు ముద్దుల దాకా నీ దగ్గరే ఉన్నాయ్.

యే తొలి సంధ్య వేళ సూర్యోదయమో, మలి సంధ్య వేళ చంద్రోదయమో చూసినప్పుడు జ్ఞాపకాలు తెరలు తెరలుగా చుట్టుముడుతాయ్. ఆ జ్ఞాపకాల తాలూకు పునాదులు ఇంకా నీ దగ్గరే ఉన్నాయ్. కాస్త వాటిని నా ఇంటికి బట్వాడ చెయ్యవూ. అవి గుర్తొచ్చినప్పుడల్లా శ్వాసా, గుండె నేనంటే నేనని పోటీపడి మరీ పరుగెడుతున్నాయి. ఆ పరుగు పందెంలో ఎక్కడ నన్ను నేనే ఓడించుకుంటానో అనే భయమేస్తున్నది. కాస్త వీలు చేసుకొని నావి నాకు తిరిగివ్వవూ. ఈ యాదుల వరదలో ఈది ఈది అలసిపోయాను. ఇక కాస్త ఒడ్డుకు చేరి నడక నేర్చుకుంటాను.

మనం కలిసున్న రాత్రుల్ని లెక్కపెడదాం అని మొదలెట్టిన ప్రతీసారి లెక్క తప్పి పోతుంటాను. ఆ అనేకానేక రాత్రులందు వెన్నెల సాక్షిగా చెప్పిన ముచ్చట్లన్నీ నీ దగ్గరే ఉన్నాయ్. నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ నా మాటలన్నీ మూటగట్టి నీ దోసిట్లో పోసాను. ఎవరితోనైనా మాట్లాడుదామంటే నాకంటూ కొన్ని మాటలు లేకుండా పోయాయి. కాస్త ఆ మాటల మూటను తిరిగి పంపించే ఏర్పాటు చేయవూ. ఇప్పటిలా తడబడటం ఆగిపోయి, అప్పటిలా మళ్లీ మాటల ప్రవహమై ప్రవహించాలని ఉంది.

ఆ పాటల్లో నూట పదహారు రాత్రులని సరిగ్గా లెక్కెలా రాశారు అని అడిగితే “It’s not the number which is important, it’s important that somebody kept the count of the moonlit nights of which they spent together.” అని అన్నాడట గుల్జార్. మరి నేనేమో లెక్కపెట్టిన ప్రతీసారి లెక్క తప్పిపోతున్న. వాటిని లెక్కలేనన్ని రాత్రులు అనుకోనా? అయినా మాయ మాత్రం అనుకుందా ఇలా గడిపిన రాత్రుల్ని లెక్కిస్తూ గడిపేస్తానని. నేను మాత్రం అనుకున్నానా నడి నిదురలో నన్నొదిలేసి నువ్వెళ్ళిపోతావని. ఆర్డీ కోసం నూట పదహారు పాటలు రాసాడట గుల్జార్. గుల్జార్ రాసినా బాణీ కట్టేందుకు ఆర్డీ భౌతికంగా లేడు. నేను రాసినా చదివేందుకు నువ్వు పక్కన లేవు.

ఏ రాత్రులందు నిద్రపట్టకో మాయ నజ్మ్ రాసుకున్నట్లే, కలలందు వెంటాడే యాదుల్లో నాలుగు వాక్యాలు రాసుకుంటాను. నీ దగ్గర ఉండిపోయిన నా వస్తువులకై ఎదురుచూస్తూ. ఇప్పుడు కాకపోయినా నేను పోయాక నన్ను దహించు చోటో, దఫ్నాయించు చోటో తీసుకొచ్చి పక్కన పెట్టు.

దగ్ధ గీతం

సిగరెట్ ని శ్వాసలా ఎగబీలుస్తుంటే
మండిపోతున్న పొగాకులా ఉంది హృదయం
రోలింగ్ పేపర్ చప్పుడును తలపిస్తూ
దేహాంతరాల్లో ఏదో పెటిల్మని పగులుతున్న భావన

మది మసైపోతుందని తెలిసినా
నీ స్మృతుల్నే నిలుపుకున్నాను
వేదనాభరిత రాత్రుల్ని తట్టుకునేందుకు
మత్తునాశ్రయించాను

రాత్రులందు నీ జ్ఞాపకాల్లో
నన్ను నేను కాలబెట్టుకున్నాక
ఉదయాన్నే కొత్తగా లేస్తాను
రాత్రికి మరోసారి మండిపోయేందుకు

రగిలే నీ యాదుల కాష్టంలో
నే ఓ దగ్ధ గీతం

టూటే హువా ఖ్వాబ్


ఇరిగి పోయిన కలలు
ఎన్నో నేర్పించాయ్
ఎద పొందినదాన్నేదో
కళ్ళు పోగొట్టుకున్నాయ్

శైలేంద్ర గొప్పగా చెప్పాడు కదూ. బహుశా ఒకే ఒక్క శైలేంద్ర మాత్రమే చెప్పగలడు అనుకుంటా. అనుకుంటా ఏమిటి. శైలేంద్రనే చెప్పగలడు. అతడొక్కడే చెప్తాడు గనుకే, తాగుతూ ఏదో రాసుకుని బార్  చెత్తకుండి లో విసిరేసిన కాగితాన్ని ఏరి మరీ బాణీ కట్టుకున్నారు. నేనంటే నేనని పరుగులు పెట్టారు. అయితే ఇప్పుడు శైలేంద్ర గురించి రాయట్లేదు. అతడి వాక్యాల్లో నన్ను నేను వెతుక్కున్నాను.

"ఎద పొందిన దాన్నేదో, కళ్ళు పోగొట్టుకున్నాయ్". నేనూ అంతే కదూ. ఎద పొందిన అనేకాల్ని ఇంకా వెతుకుతున్నాను. కానీ, ఎక్కడా? ఏవీ కంటికి కనరావే. అనేకం వరకేందుకు. నువ్వు? నువ్వు మాత్రం ఎదలో తప్ప, జ్ఞాపకాల్లో తప్ప కంటికి కనబడుతున్నావా? లేదు కదా. శైలేంద్ర మేరే దిల్ కె మెహ్మాన్ అంటాడు. నువ్వూ అంతే కదూ. దిల్ కి మోహల్లాలో కొన్నాళ్ళుండి, తిరగాడి జ్ఞాపకాలను వొదిలిపోయిన అథితివి. వొచ్చిపోయిన అథితీ ఇప్పటికి మనం తిరగాడిన జాగలకు నేనెప్పుడైన వెళితే యాదికొస్తావ్. మనం ఎప్పుడూ కూర్చునే చోటే కాసేపు కూర్చొని వస్తాను. నీ యాదుల్లో ఆ కాసేపు తడచిపోతాను.

ఈ మధ్య నల్లమల పొయొచ్చాను. అభివృద్ధి అంటేనే విధ్వసంమని అనేకానేక సార్లు మాట్లాడుకున్నాం కదూ. ఇప్పుడూ అంతే. మానవ విధ్వంసక యురేనియం వెలికితీత కోసం అక్కడి చెంచులను తరిమేయబోతున్నారు. యురేనియం చేసిన విధ్వసం నీకు తెలియంది కాదు. ఫుకుషిమా గురించి ఎంత మాట్లాడుకున్నాం. ఇప్పటికీ ఫసిఫిక్ లో చేపలు రేడియాక్టివ్ గానే ఉన్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఒక విధ్వంసం చేయడానికి మరొక విధ్వంసానికి పాల్పడుతున్నారు పాలకులు.

మొన్న పోయినప్పుడు శీలం బయ్యన్న (నల్లమల చెంచు) మాట్లాడుతూ... "నేను ఒక్కణ్ణే అడవిలోకి పోతా, నాక్కొన్ని పసులున్నాయ్. నేను అడివిలో వాటిని మేపుతుంటే, పెద్దపులి మా పక్కనుండే పోయింది. అది మమ్ముల ఏమనది. పెద్దపులి మా బిడ్డ. మేము దాని బిడ్డలం. ఏది మమ్ముల అడవిలకెళ్లి ఎల్లగొడుతా అన్నోడు వచ్చి అడివిల రెండురోజులు ఉండుమను సూద్దాం. మా లెక్కన అడివిల ఒక్కణ్ణే తిరుగుమను సూద్దాం." అన్నాడు. నిజమే కదూ. తనది కానీ నేలలో ఎవడైనా ఎట్లా యథేచ్ఛగా తిరగగలడు. అంతేనా... "మమ్మల్నంటే ఎళ్లగొడుతరు. మరి పెద్దపులులను, జింకలను, దుప్పులను, ఎలుగొడ్లను, మెకాలను, ఇంకా నూటొక్క తీరు జంతువులను ఏడికి కొంతబోతరు" అనీ అడిగారు. సమాధానం ఎవరు చెప్తారు. ఏ ప్రభుత్వాల దగ్గర సమాధానం ఉంది. మొదట పులుల అభయారణ్యం అని మనుషులను, తరువాత యురేనియం ఉందని పులులనూ ఎల్లగొడుతున్న వాండ్లు ఏమని చెప్తారు. ఎవరికి చెప్తారు.

మనం మాట్లాడితే మానవీయత అంటాం కదా. కానీ, ఈ చెంచులు మనం చెప్పే 'మానవీయత' పరిధిని దాటిన ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఒక్క మనిషినే కాదు. చెట్టును, పుట్టను, పక్షిని, పశువును, చివరకు మనం కౄర జంతువు అనే పెద్దపులిని బిడ్డగా చూసుకునే, చెప్పుకునే గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు లింగ్విస్ట్ లు ఓ కొత్త పదాన్ని కాయిన్ చేయాలి. నాగరికత నిర్ణయించిన 'మానవీయత' పరిధిలో గాక, మొత్తం ప్రకృతిని తమ అని భావించే ఆదివాసులను గురించి చెప్పేందుకు ఒక కొత్త పదాన్ని కాయిన్ చేయాలి. అంతగొప్ప మనుషులు ఇప్పుడు వాళ్ళ నేల నుండి బేదఖల్ అవుతున్నారు. ఇదొక నల్లమల గాయమేనా? కాదు. అడివున్న చోటల్లా ఇదే కథ. అడివిని, అక్కడి మనుషులను ఏనాడు పట్టించుకోని ప్రభుత్వాలు ఇప్పుడు అభివృద్ధి అంటూ అడవి బాట పడుతున్నారు. ఎవరి అభివృద్ధి? అభివృద్ధి ఖరీదు ఒక నాగరికతా? ఈ దేశం కన్నా, ఈ ప్రభుత్వాలు, చట్టాలు, రాజ్యాంగాల కన్నా పూర్వపు నాగరికతా?. చెట్లు, పుట్టలు, పశువులు, జీవరాశులు అన్నీ అన్నీ కనుమరుగై అక్కడో విషం నేలనుండి బయటకి తీయబడుతుంది. తన పురిట్లోనే ఒక నాగరికతను, పచ్చదనాన్ని బలిగొనే విషం కాస్త ఫ్యూరిఫై అయి సమస్త మానవాళిని బలిగొంటుంది.

శైలేంద్ర రాతను రఫీ పాడుతుంటే నీతోపాటే నల్లమలా యాదికొచ్చింది. నువ్వు గుర్తొస్తే మనం తిరగాడిన చోటుకు పోయి రాగలను. అక్కడే కాఫిడే లో మనకిష్టమైన ఫ్లేవర్డ్ కాఫీ తాగగలను. అదే ఫ్లై ఓవర్ మీద బండి నడుపుకుంటూ వెళ్లగలనూ. మనం గడిపిన సముద్ర తీరంలో కూర్చొని నిన్ను యాది చేసుకుంటూ మనకిష్టమైన పాటల్ని ఇయర్ ఫోన్ లో వినగలను. కానీ, ఒక్కసారి తన నేల నుండి విసిరేయబడినవారు వారి నేలను మళ్లీ చేరుకోవడం కుదరదు. అక్కడున్న తమ పూర్వీకుల యాదుల్ని తరచి చూసుకోనూ లేరు. తామొకనాడు ఉన్న నేల ఇప్పుడు పరాయిదైపోతుంది. ఆ నేలలో పుట్టుకొచ్చిన విషపు కంపెనీల చుట్టూ సాయుధ పహారా ఉంటుంది. ఇక్కడొక ఊరుండేది. అందులో మనుషులుండేవారు. ఈ నేలపై కొన్ని గురుతులుండేవి. అని చెబితే తప్ప ఎవరికీ తెలియదు. వాళ్ళ ఎద పొదుముకున్న జ్ఞాపకాలేవీ ఇక కళ్ళముందు కనపడవు. కనీసం పోయి చూసుకుందామన్నా వాటి ఆనవాళ్ళూ ఉండవు. అందుకేనేమో శైలేంద్ర 'ఇరిగిపోయిన కలలు ఎన్నో నేర్పించాయ్' అన్నాడు.

నిజమే. ఇరిగిపోయిన కలలు చాలా నేర్పించాయ్. ఎదలో నిండిన నీవు కనుచూపుమేరలో లేవు. ఏ గాఢనిద్రలోనో నువ్వు యాదికొస్తే ఉలిక్కిపడి నిద్రలేస్తాను. తరువాతిక నిద్ర పట్టదు. ఇప్పుడు అక్కడి జనాల పరిస్థితీ అదే. ఊరు పోతుందని నిద్ర పట్టడం లేదన్నారు. కళ్ళు కనపడని ముసలావిడొకర్తి ఊరు వొదిలి పోయేవాళ్ళు తనను వెంట తీసుకుపోతారో లేదోనని అన్నం తినడం మానేసింది.

ఎదలో నిండింది. దేహంలో, ఆలోచనల్లో భాగమైంది కళ్లకు కనపకుండా పోవడం విషాదం కదూ. శైలేంద్ర పాటను బతుక్కి అన్వయించుకుంటే నువ్వు యాదికొచ్చావ్. వెళ్తూ వెళ్తూ నువ్ చూసిన చూపు యాదికొచ్చింది. నల్లమలా, అక్కడి మనుషులు, వాళ్లతో మాట్లాడిన మాటలూ యాదికొచ్చాయ్. అట్లా యాదికొచ్చిన ఒక్కో యాదిని నిదురపట్టక ఇలా రాశాను.