Thursday, January 31, 2019

మత్తు చూపుల కనులు

సాకీ,
ఆ కనుల కొస నుండి
విసరకు
మరో చూపు
అది తాకి
మత్తెకి పోతాను
నువ్ తెచ్చిన ప్యాలా
అంతా తాగేసినట్లుగా

అవును ప్రియా
అవి కళ్ళా
కాటుక గోళాలా

ఏమా నడుమొంపులు
నువ్ వయ్యారంగా దరికి వస్తుంటే

నీ కురులు ముద్దాడాయి
నువ్ పెదాలు జత కలపకమునుపే

చూడకు సూటిగా అలా
ఆ చూపులు పురిగొల్పుతాయి
ఏదో ఓ చిలిపి పని చేయాలని

చక్కిలిగింతల నవ్వులు
వేళ్ళు నీ నాభీని మీటగానే

పలవరిస్తున్నాను
ఈ మత్తులో ఏదేదో
సాకీ,
నీ చూపు సోకి
నన్ను నే మైమరచి
నీ ముందు మోకరిల్లి

Mohan Babu 'ఐస్ తో నా దేఖో, కె హమ్ కో నషా హో జాయే' నేను ముందే చెప్పిన ఆ కళ్ళు మాములు కళ్ళు కాదు బాస్. లాగేస్తాయ్ అని. విన్నవా. రెస్పాండ్ అవ్వమన్నావ్. చూడు. ఆ చూపు సోకి, నన్ను నే మైమరచి, ఆమె ముందు మోకరిల్లి ఏదో పలవరిస్తున్నాను.

చలిగాలి

నిదురపట్టక
ఈ రాతిరి హృదయం
అడుగుతోంది
కొన్ని కథలు చెప్పమని

ఎగిరిపోవాలి
మబ్బుల ఊరిలో తిరుగుతూ
నాలానే వచ్చిన
చుక్కలతో మాట్లాడేందుకు

కానీ,
ఎక్కడ దొరకాలీ
ప్రవరుడిలా పాదలేపానం

విరహ బాధతో కోస్తుంది ఎదను
ఈ జనవరి మాసంతపు చలిగాలి

కరిగిపోతున్నాయి
కలలన్నీ కలలోనే

మేల్కొనేసరికి
పరుచుకుంటుందేమో ఓ చెట్టు నీడ

సాకీ,
నే లేచిసరికి
పక్కనుండవూ

Mohan Babu 'Tandi Hawa Yeh, Chandini Suhani' పాటకి రెస్పాండ్ కాలేదు అన్నావ్ కదూ. ఇదిగో ఇప్పుడే పాట ఇప్పుడేవిన్న. విన్నాక ఇలా రెస్పాండ్ అవుతున్న. ఆ కళ్ళ పాటవైపు వెళ్లాలంటే ఎక్కడ లాగేస్తుందో అని భయమేస్తోంది బాస్ 😜

Friday, January 25, 2019

Perhaps last poem

ఎప్పటిలానే మర్చిపోయాను అనుకుంటాను
ఏదో ఓ ముచ్చట నిన్ను యాద్జేస్తనే ఉంటది

నా గుండెల మీద నాగరికత సంతకం చేసినదానవు కదా
ఇత్నా జల్దీ కైసే బూల్ జావూ తుమ్హే

వెన్నెల రాత్రులందు ఒడువని ముచ్చట్లు
మైదానాటవి నదీతీరాలు మొదలు
నేలా సముద్రం ముద్దాడే చోటుదాక అలుపెరుగని నడకలు
అలసిపోయిన పాదాలను ముద్దాడే అలలు
మనదైన ఒంటరి ప్రయాణాలు
ఒంటరి ప్రయాణాల్లో నీవు తోడుంటే బాగుండు అనే సందేశాలు
కలలందు వెంటాడే కన్నులు
అరవిచ్చిన పెదాల కొసనుండి విసిరే నవ్వులు
అన్నీ నిన్నా మొన్నా జరిగినట్లుగానే

'ఇద్దరు కలిసి రావట్లేదేంటని' హుస్సేన్ సాగర్ బుద్ధుడు అడిగాడు
వెన్నెలా బుద్ధుడు రాత్రంతా మన జ్ఞాపకాలు కలబోసుకున్నారట
కిటికీ తలుపు తట్టి మరీ చెప్పింది వెన్నెల

నన్నొదిలి పోయిన నువ్వు నాకేమవుతావ్?

నా బతుకు
ఆదిమగుహలో తొలుసురు మానవుడు చెక్కిన కుడ్యానివా!
నదితీరపు నాగరికత కట్టడానివా!
ఖైద్ జిందగీకా ఆజాది తమన్నావా!

గుండె గొంతుకలో కొట్లాడుతుంటే ఏమీ పలకలేక అట్లే రాసుకున్న

నిన్ను నా రాతల్లో చూసుకుంటానన్న పిల్ల
బహుశా నీకోసం నే రాసే
చివరి రాత ఇదే కావొచ్చు

ఉంటాను మరీ
సాకీ
తలుపు దగ్గర ప్యాలాతో ఎదురుచూస్తూ ఉంది

Thursday, January 24, 2019

ఎదురుచూపు

గడచిపోతున్న క్షణాల్లా
ఒక్కొక్కటిగా రాలిపోతున్న ఆకులు

అనుకుంటాను
ఆకురాలిన ప్రతీసారి
శిశిరమై రాలినా
వసంతమై చిగురిస్తుందని

కనులు వర్షమై కురుస్తున్నాయి
దేహం గ్రీష్మమై కాలిపోతూ

ఓ హేమంతమా
నా ఎదురుచూపులంతా
శరత్కాలపు వెన్నెల కోసమే

23/01/19

Friday, January 4, 2019

ఓ కొసెల్లని రాత్రి


ఏదో రాయాలని కూర్చుంటాను
అస్తవ్యస్త వాక్యాలు కొన్ని
డంజన్ ముందటి రోడ్డుమీది పొన్నపూలలా
పేపర్ పై చెల్లాచెదురుగా పడతాయి

ఈ రాత్రికి ఒడగొట్టాలని
పుస్తకం ముంగటేసుకుంటాను
పాత్ర జీవితంలో చొరబడి
జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంది

ఈ రాత్రికి ముసలోడి అంతు చూడాలని
ముచ్చటలోకి దిగుతాను
వాడు రెండో మోడో తత్వాలు చెప్పగానే
Sorry, I'm not interested అని
లేచి వస్తాను

ఎందుకో ఈ రాత్రి ఎటు కొసెల్తలేదు

Sunday, December 30, 2018

వో కల ఉండేది


వో కల ఉండేది 
ధ్వంసమైంది
వో తలంపుండేది 
దాని జాడ లేదు
కానీ,
ఈ ఎదకేమయింది
ఎందుకారిపోయిందో
తెలియకుంది

Friday, December 21, 2018

దిశంబర్ 6





1
కాల్పుల శబ్దం. దూరంగా వినపడుతూ ఉంది. ఎదురుగా గుంపులు గుంపులుగా మనుషులు. అందరి కళ్ళల్లో ఎదో భయోత్పాతం. ఒళ్ళంతా రక్తం. కాస్త ముందుకు వెడితే వాళ్ళు నడచి వచ్చిన దారి పొడుగుతా ఎర్రని మరకలు. ఇది ఎర్రమన్ను నేలా!? అన్నంతగా ఆ తోవపై రక్తం.


కాలుపుల శబ్దం ఆగిపోయింది. ఓ సమూహం అక్కడి నుండి వెళ్ళిపోయింది. చెట్లదాటున దాగున్న మనుషులు ఒక్కరోక్కరిగా బయటకి వస్తున్నారు. వాళ్ళ రాకడ దూరం నుండే కనిపిస్తున్నది. అట్లానే ఇంకాస్త ముందుకు పొతే. సమూహం వదిలి వెళ్ళిన జాగా. పక్కనే గుబురు పొదల మీద. మానుల మీద. పచ్చికల మీద అంతటా ఎర్రని మరకలు. ఆకాశం పాన్ నమిలి ఊసినట్లుగా. మబ్బులు ఎర్రని నీళ్ళనే కురిసినట్లుగా. పచ్చని చెట్లమీద ఎర్రని మరకలు. చెట్లకు వేలాడుతూ దేహాలు. ఎక్కడపడితే అక్కడే దేహాలు. మృత దేహాలు. 
***********

2
భీమా...... ఫిర్ అజా జరా... అంటూ ఆర్ద్ర్తంగా ఓ గొంతు. ఎన్ని ఏండ్ల ఎదురుచూపో ఆ గొంతులో. ʹ ఎందరో మహాత్ములు వచ్చారు. ఎందరో మహత్ములు పోయారు. కానీ అంటరానివారు ఇంకా అంటరానివారు గానే ఉన్నారు.ʹ ఓ ఉపన్యాసం. మళ్ళీ కొన్ని గొంతులు. అంతే ఆర్ద్రంగా. దీనంగా. విషాదంగా. అదే పిలుపు. ʹభీమా... మళ్ళీ రావా ఓ సారి...ʹ
రేపే ఎన్నికలు. 
నేడు ఆయన వర్ధంతి. 
ʹఓటు ఆయన ఇచ్చిన హక్కు. దాన్ని వాడుకోవాలి.ʹ
ʹవైరుధ్యాల మీద ఆయన ఉపన్యాసం విన్నావా? ఇట్స్ టైం టు ఓవర్ త్రో దిస్ ఆటోక్రసి.ʹ

ʹఒక మనిషి ఒక ఓటు. ఒక వోటు ఒక విలువ.ʹ ఉపన్యాసం కొనసాగుతూ ఉంది. 
ʹఒక మనిషి ఒక విలువʹ. ఎవరో అరిచారు. అరుపు ఉపన్యాసంలో కలిసిపోయింది.

ʹమన రాజ్యం రావాలి. మనం రాజులం కావాలి.ʹ ఉపన్యాసం ఆగట్లేదు. 
ʹసంపద జాతీయం కావాలి. భూమి అందరికి దక్కాలి. స్టేట్ సోషలిజం. ఇంకా ముందుకు పోయి స్టేట్ లెస్ సోషలిజంʹ ఎవడో ʹస్టేట్స్ అండ్ మైనారిటిస్ʹ చేతిలో పట్టుకొని మరీ అరుస్తున్నాడు.
ఎవడ్రా ఈ పిచ్చోడు. రాజ్యం వద్దంటున్నాడు. అంటూ ఓ గుంపు, చేతులకు దారాలు, మేడలో రుద్రాక్ష ఉన్న నాయకుని వెంట పోతుంది.
ʹభీమా... మళ్ళీ రావా ఓ సారి...ʹ అదే గొంతు ఆర్ధంగా అర్ధిస్తున్నది. అంతే ఓ అగ్ర గుంపు మీదపడి ఆ గొంతును నులిమేసింది. ఆ పాట మూగబోయింది. అంతా మౌనం. 
కొన్నిరోజులకు మళ్ళీ అదే ఉపన్యాసం. మాయమైన మనుషులు చాలామంది మళ్ళీ కనిపిస్తున్నారు. చూస్తుండగానే కాలసూచికలో తేది మారింది. ఫోన్ తెరమీద చూస్తే అది ఏప్రిల్ 14.
***********

3
వరుసగా జనాలు. అందరి చేతుల్లో కాషాయరంగు జెండాలు. జై శ్రీరాం అని నినాదాలు. అందరి మొహాల్లో ఓ ఉన్మాదానందం. దూరంగా ఓ పురాతన కట్టడం. దాన్ని చూడాగానే వీళ్ళది పరుగులాంటి నడక. ఒక్కొక్కరుగా ఆ కట్టడం మీదకి ఎక్కుతున్నారు. సుత్తెలు. గడ్డపారాలతో దాని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చూస్తూ ఉండగానే అది కూలిపోయింది. అందరి కళ్ళలో ఓ వికృతానందం. ʹబృహదత్తున్ని చంపి, బౌద్ధరామాలను కూల్చిన ʹపుష్యమిత్ర శృంగుడిʹ ఆనందం అది. గోబెల్స్ తన అబద్దాలను నిజం అని నమ్మే జనాలను చూసి పడిన ఆనందం అది.ʹ

అరేయ్ ఆ నిండు నల్లనిదాన్ని ఆపండి. ఎవరో చేతులో త్రిశూలంతో అరుస్తున్నారు. అడ్డంపడి ఆమెను ఆపేశారు. ఒకడు త్రిశూలాన్ని ఆమె...
ఉలిక్కిపడి లేచాను. నేను రాత్రి పడుకున్న చోటే ఉన్నాను. ఓహో ఇదంతా కలా!? కండ్లముందటి విషాదమా!?