Saturday, August 25, 2018
ప్రేమలేఖ -17
Wednesday, August 1, 2018
ప్రేమలేఖ 16
బతుకు నిరంతర వలస అయినచోట నేనో నిత్య నోమాడిక్. మా తాత బతుకుదెరువు కోసం వలస పోయాడు. మా అయ్యా చదువుకోసం వలస పోయి అక్కడే స్థిరపడ్డాడు. నేను అంతే చదువు కోసం వలస వచ్చి నా ముందు తరాలు పోగొట్టుకున్నదేదో వెతుకుతున్నాను. మూతికి ముంత, మొలకు చీపురు పోయి, అల్ట్రా మోడ్రన్ బతుకే బతుకుతున్నా నన్నింక అలగాగ తప్ప మనిషిగా చూడని చోట మానవీయ సమాజం ఎక్కడైనా తారసపడక పోతుందా అని వెతుకుతున్నాను. ఆ వెతుకులాటలోనే స్వేచ్ఛను, విముక్తిని కలగంటూ, నిజం అయ్యే కాలం కోసం ఎదురుచూస్తున్నాను. ఎదురుచూపులో, వెతుకులాటలో పడి నేనో భైరాగినయ్యాను. ఆ తత్వం నా రాతలోకి ఎంత వచ్చిందో తెలియదు గానీ గడ్డం మాత్రం ఓ మోస్తరుగా పెరిగింది. ఎందుకో ఇప్పుడు పుట్టినూరికి పోయి రావడం నాకు ఓ ట్రావెలాగ్ యే తప్ప నోస్టాల్జియా కాదు. ఇంటికి పోగానే నేనేదో కొత్త చుట్టం అయిన ట్రీట్మెంట్. మా తాత అన్నట్టు సుక్క తెగిపడినట్టు పోతే అంతే కావచ్చు. ఒక్కరోజు పర్యటనకు రెండు రకాలుగా వండిన చేపలు, రొయ్యలు కాస్తా 'రాక్ ఫోర్డ్'. నువ్వు రావాల్సింది. నాకు కాస్త చుట్టం ట్రీట్మెంట్ నుండి తెరిపి దొరికేది. ఎప్పుడు వస్తా అన్నా హామీ తప్ప అది అమలయ్యింది లేదు. నువ్ నాతో ఇంటికి రావడం 'అమలుకానీ హామీల చరిత్ర'. బేటుని అడిగితే బిజీ డాడీ అంది. నేను ఫ్రీగా ఉన్నప్పుడు అడగవేంటి డాడీ అని అంది.
ఒక్క సంవత్సరానికి ఊరు ఎంత మారిపోయింది. తిరిగి FCI తెరుస్తున్నారని సంతోషపడాలా! నలభై ఫీట్ల రోడ్డు కోసం సగానికి తెగిపడ్డ దేహాల లాంటి ఇళ్లను చూసి భాధపడాలా!?. బస్టాండ్ లో దిగి ఇంటికి పోతున్న చూసిన దృశ్యం ఎందుకో హాంట్ చేసింది. అభివృద్ధి పేరుమీద జరిగే విధ్వంస దృశ్యం అది. ఎప్పటి సాయంత్రాల్లాగే ఓల్డ్ అశోక్ దగ్గరి టీ స్టాల్ కి పోయా. అక్కడి మిర్చిల బండి మాయం అయి, చుట్టూ ఇనుప కంచె మొలిసి బండ్లు పెట్టె జాగను ఆక్రమించింది. దుకాణం ముందు బండి పెడితే బిక్కుబిక్కుమనే చాయ్ దుకాణం ఓనర్. అర్జున్ స్వీట్ హౌస్ రస్ మలాయ్ టెస్ట్ యేమి మారలే. న్యూ అశోకలో ఇంకా ఏసీ పనిచేస్తలేదు. ఉక్కపోతలోనే, అంగీ వెనుకవైపు తడిచి ముద్దయితే సినిమా అయిపోయినట్టు.
తెల్లారి సాయంత్రం మళ్ళీ ఓల్డ్ అశోక్ పర్యటన. ఎందుకో ఊర్లో ఉన్నన్నీ రోజులు అక్కడకు పోయి ఛాయా తాగడం ఓ మానుకోలేని అలవాటు. లక్ష్మీనగర్ తొవ్వ ఇప్పుడు వన్ వే. కొత్తగా చౌరస్తాలో ట్రాఫిక్ లైట్లు వెలగడం మొదలెట్టాయి. అవి ఆఖరిసారి యే పదేండ్లకిందనో వెలిగిన జ్ఞాపకం. అక్కడ రైట్ తీసుకొని ఫైవింక్లైన్ దాకా పోయోద్దం అని పోయాం. కనకయ్య దుకాణం రూపు మారినట్టు ఉంది. ఆ పక్కన గల్లీలోనే ఆకర్ష్ వాళ్ళు ఉండేవారు. సీత నగర్ బోర్డు వెలిసి పోయి, రాం నగర్ బోర్డు సిలుము పట్టింది. ఈరమ్మ హోటల్ నడుస్తుందో లేదో! ఆ రాత్రి ఎందుకో కనపడలేదు. అట్లే పుట్టుక, ఊహచ్చేదాక బాల్యం గడిపిన పాత ఇంటి దాకా పోయోద్దాం అనుకున్న ఎందుకో పోవాలనిపించలే. నువ్వుంటే తీసుకుపోయేవాడిని. మా వాడకట్టులో ఉన్న నానమ్మలకు, అత్తలకు పరిచయం చేసేవాడ్ని. అంతా కలిసి 'నీ బుగ్గలు చిదిమి దీపం పెట్టేవాళ్ళు'. ఏరియా హాస్పిటల్ లో బాబాయ్ దగ్గరికో, లేక నా హెల్త్ చెకప్ కు పోయినప్పుడు తప్ప ఆ ఏరియాకు పోయింది లేదు. అది దాటి పోక ఏండ్లు గడుస్తుంది. ఏరియా హాస్పిటల్, సబ్ స్టేషన్ గోడకు GRMC పెయింటింగ్ లు. 'ఆడపిల్లల కాపాడుకుందాం', 'నీళ్లు జీవనాధారం' సరిగ్గా గుర్తులేదు కొటేషన్ ఇదో కాదో, కానీ అమ్మాయిలు, నీళ్ల గురించి ఉన్నాయి. కాసేపు నవ్వుకున్నా. గోదావరిఖని గోడల మీద ఆ నినాదాలు చూసి. 'అమ్మాయి ప్రేమించట్లేదని యాసిడ్ పోయడం' అనే ఉన్మాద ప్రక్రియకు ఆద్యురాలు మా ఊరు. ఓపెన్ కాస్ట్ ల పేర ఊర్లన్నీ బొందల గడ్డలు, మట్టి దిబ్బలు అవుతుంటే నీళ్ళేక్కడ ఉంటాయి. ఆ నినాదాలు హాంతకులే సంతాప సభలు జరిపినట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమి మారలేదు. 'ఎచట స్త్రీలు పూజింపబడతారో అచట దేవతలు కొలువుంటారు' గాంధీ కాలేజ్ తలుపు రాసిఉన్న రాత. దాని ముందే అమ్మాయిలను చిడాయించడం చూశాను.
జ్యోతినగర్ బోర్డు ఇప్పుడో పురా జ్ఞాపకం. ఆ పక్కనే దాదాపు ఏడెనిమిది ఏళ్ళు కిరాయికి ఉన్నాం. అక్కడి నుండే మూడు స్కూళ్ళు మారాను. ముందుకు పోతే మా ఇంగ్లీషు మీడియం దెబ్బకు మూతపడ్డ మా బడి 'జ్ఞానోదయ విద్యాలయం' తన రూపురేఖలు మార్చుకుని గుర్తుపట్టకుండా అయింది. 'బడి మాదే అయినా నేనెందుకు మాదిగ సారోళ్ల కొడుకునే అయ్యాను.' 'ఈ దేశంలో వర్గాన్ని కులం నిరంతరం డామినేట్ చేస్తది అనేందుకు నా జీవితమే నాకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ'. అది అమ్మిన తరువాత అక్కడి నుండి మార్కండేయ కాలనీకి షిఫ్ట్ అయ్యాం. ఫైవింక్లైన్ దాకా పోయి అక్కడ కాసేపు ఆగాం. అక్కడ గంటలు గంటలు రౌడీలు కొట్టుకునే వారని చిన్నపుడు విన్నా. చెవి తెగిపడ్డ కొట్లాడుతూనే ఉన్నారని. హత్యలు చాలా సర్వసాధారణం అయిన కాలం అది. ఇప్పటికి ఏమీ మారలే. జైలుకు పోయి వచ్చినవాడు అక్కడ హీరో. వాళ్ళని భయపెట్టే సికాస ఇప్పుడు లేదు. గోడల మీద వెలిసే పోస్టర్లు లేవు. అదిప్పుడు కార్మికుల గుండెల్లో పురాస్మృత జ్ఞాపకం. అమరుల తడి ఆరని యాది. పోరాటాల నేల ఇప్పుడు దళిత దళారుల, రౌడీల రాజ్యం. వాళ్ళు ఆడింది ఆట. పాడింది పాట. పైసా పేకో తమాషా దేఖో.
ఎందుకో జ్యోతి నగర్ లో ఉన్న ఇల్లు చూడాలనిపించింది. మళ్ళీ అదే రోడ్డులో వెనక్కి వచ్చి ఇల్లు, స్టేడియం చుట్టూ ఓ రౌండ్ వేశామ్. ఆ రోడ్డు మీదే సైకిల్ నేర్చుకుంటూ కిందపడి మోకాళ్ళు కొట్టుకుపోయింది. ఆ స్టేడియంలోనే కరాటే అని, ఫుట్ బాల్ అని కోచింగ్ కి పోయింది. ఏవి వంటబట్టక వదిలేసింది. రాత్రిదాక తిరిగి ఇంటికి వస్తే వీపు బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ అయ్యింది అక్కడే. స్టేడియం ఎంట్రన్స్ పక్కన పానీపూరి బండి అతను మారాడు. ఊరంతా గప్ చుప్ వెయ్యమంటే నేనొక్కన్నే (కాగజ్ నగర్ ప్రభావంతో) పానీపూరి అనేది. అట్లా అనేది నేనొక్కనే అని అతనికి ప్రత్యేక అభిమానం ఉండేది. మనకు చివరకార్లో ఎగస్ట్రా పూరి వేసేది.
ఎల్బీ నగర్ బోర్డు అదో పురాస్మృతి. ఆ బోర్డు కింద నుండి ఓ అమ్మాయితో కలసి నడచివచ్చిన యాది. ఆ వయస్సులో అది ప్రేమో, ఆకర్షనో తెలియదు. ఆ అమ్మాయి మాత్రం ఇప్పటికి స్పెషల్ అనిపిస్తుంది. ఇప్పుడు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లల తల్లయింది. అదే క్లాసులో ఇంకో అమ్మాయి ఉండేది. 'మాది'గది (మాది+గది) అని తనని అంటే క్లాస్ లో ఉన్న అందర్నీ నిలబెట్టి కులాలు అడిగిన అమ్మాయి. వాళ్లిద్దరి గురించి ఆపేసిన బాల్యస్మృతులు మళ్ళీ మొదలెట్టి రాయాలి. విధ్వంసం అవుతున్న జీవితాలు. వెంటాడుతున్న కులం. ఏది ఇప్పుడు జ్ఞాపకం కాదు. కళ్ళముందు కనపడుతున్న వాస్తవం. ఊరు ఇప్పుడు ట్రావెలాగే తప్ప వెంటాడుతున్న కులం చేసిన గాయాల సాక్షిగా నోస్టాల్జియా కాదు.
తిరిగి వస్తుంటే మూత పడ్డ ఎ పవర్ హౌజ్. కరిగిపోతున్న గుట్టలు. వలస కార్మికుల నెత్తురు స్వేదంగా మారి గ్రానైట్ తీస్తే, దేశదేశాలకు ఎగుమతవుతూ తెచ్చే పైసలతో కొందరి ఒంటి మీద బట్టలు 'శ్వేత'రంగులో మెరుస్తున్నాయి. ఊరు పోయి వస్తే వెంటాడుతున్నది విధ్వంసమే. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న విధ్వంసమే.
నువ్వూ రావాల్సింది పిల్లా. అమ్మ తినిపించే గోరుముద్దలనే కాదు ఈ విధ్వంసాన్ని పరిచయం చేసే వాడిని. విధ్వంసమవుతున్న బతుకుల్ని పరిచయం చేసేవాడ్ని. ఎందుకు 'నేనెప్పుడూ కులం అని మాట్లాడుతా' అని ఎవరో అన్నారన్నావుగా, పుట్టుకనుండి అది చేసిన గాయాలను పరిచయం చేసేవాడ్ని. అప్పుడు నా దాకా రాకుండా నువ్వే సమాధానం చెప్పొచ్చు. ఎందుకో ఈ ప్రయాణంలో నీ కంపెనీ మిస్ అయ్యాను. నువ్వూ ఉండాల్సింది అనిపించింది.
Wednesday, July 25, 2018
ప్రేమలేఖ 15
పదాలకు ఇమడకుండా,
మాటల్లో చెప్పలేని కొన్ని భావాలుంటాయి. నువ్ కనులతో పలికించినట్టు. నా ఎదపై మోపిన నీ పాదాలను ముద్దాడినట్లు.
ఇప్పుడు అంతే ఏం రాయాలి. రాయడం మొదలెడితే ఎంతని రాయాలి. జ్ఞాపకాల్ని అక్షరాల్లో కలబోసుకోనా! ఊసుల్ని పదాల్లో కూర్చనా! ఆనంతానంతా ప్రేమను వాక్యాలుగా చేసి ప్రవహింపజేయనా! వాక్యాలన్నీ ప్రవహించి ప్రవహించి ఏదో ఓ రోజు సంద్రమవుతాయి. వాక్యాల సంద్రంలో జ్ఞాపకాల లోతులుంటాయి. గాయాలుంటాయి. తిరుగుబాటు పాటలుంటాయి. కింద పడ్డ ప్రతిసారీ మళ్ళీ నిటారుగా లేచి నిలబడ్డ ధిక్కారం ఉంటుంది. స్వాభిమాన ప్రకటనలు ఉంటాయి. నువ్వుంటావు. నేనుంటాను. మనంగా బతికిన కాలం ఉంటుంది. ఎడబాటు, కన్నీళ్లు, వలపోతలు ఉంటాయి. ఎప్పటికిలాగే కలలకై మనం చేసే ప్రయాణం ఉంటుంది. కలసి కన్న కల ఉంటుంది. కలసి కనాలకున్న కల చెదిరిపోయిన విషాద జ్ఞాపకంగా ఉంటుంది. నవ్వుతూ, లేడిపిల్లలా గెంతుతూ కళ్లముందుకు వచ్చిన అల్లరి పిల్ల 'కల' ఉంటుంది. ఎందుకో ఇవన్నీ చెప్పాలనిపించినపుడు చెప్పుకోవడానికి నువ్వుండవు. దూరంగా ఎక్కడో ఉంటావ్. ఎప్పుడు వస్తావో తెలియదు. కానీ మళ్ళీ వస్తావనే నువ్ ఇచ్చిన నమ్మకం, చూడమన్న ఎదురుచూపు ఇంకా నాతోనే ఉంది. ఉంటుంది. అది గొంతులోకి దిగిన హబ్సన్ మత్తులా ఉంది.
నీకు రాద్దాం అని కూర్చోగానే ఎందుకో కీట్స్ గుర్తొచ్చాడు. కీట్స్ తన ప్రేయసికి రాసిన లేఖ గుర్తొచ్చింది. చదువుతుంటే, కీట్స్ పోయెమ్ ఒకటి గుర్తొచ్చింది.
"Pillow'd upon my fair love's ripening breast,
To feel for ever its soft fall and swell,
Awake for ever in a sweet unrest,
Still, still to hear her tender-taken breath,
And so live ever—or else swoon to death." ఈ కవిత పాదాలు నిన్ను ఇంకా ఇంకా మిస్ అవుతున్న అని గుర్తుచేశాయ్. నిజంగానే ఏదో sweet unrest ఎదను తొలుస్తుంది. అయితే అది కీట్స్ అన్నంత swoon to death స్టేజ్ కి ఇంకా రాలేదు.
చరిత్రలో కొన్ని తేదీలు మర్చిపోలేం. కొన్నిసార్లు కావాలని మర్చిపోయినట్టు నటిస్తాం అంతే. అవి అట్లా ఉండిపోతాయ్. ఎంతకీ తుడిచిపెట్టుకుపోని జ్ఞాపకంగా. ఆ తేదీల చుట్టూ అల్లుకున్న గడచిన అందమైన క్షణాల్లా. కొన్ని తేదీలు పురాస్మృతులు కాదు. వెన్నాడే జ్ఞాపకాలు. మరికొన్ని చక్కిలిగింతల చిరునవ్వులు. మెడఒంపును తాకిన వెచ్చని నిచ్వాసలు. చలికాలపు వెచ్చని, ఎండకాలపు చల్లని రాత్రులు.
Monday, July 16, 2018
ప్రేమలేఖ 14
Tuesday, July 3, 2018
ప్రేమలేఖ 13
Thursday, June 28, 2018
ప్రేమలేఖ 12
నువ్వు ఈ వార్త చదివే ఉంటావ్. మహిళలకు భద్రత లేని దేశాల్లో ఇండియాది మొదటి స్థానం అంటూ ఓ అమెరికన్ సర్వే కథనం. జనాల గగ్గోలు చూసి నాకు నవ్వొచ్చింది. వినడానికి వింతగా ఉన్నా , నవ్వే వచ్చింది. రాహుల్ సాంకృతయాన్ 'వోల్గా నుండి గంగ' గుర్తుందా. అందులో 'గార్గి' అని ఉంటుంది. తానొక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేక 'గార్గి నీ శిరస్సు నేలకూలిపోతుంది, ఇక మీదట ప్రశ్నించావంటే' అని యజ్ఞవల్కుడు బెదిరించి ఆమెతో వాదం గెలుస్తాడు. తరువాత గార్గి తన అత్తతో చేసే సంభాషణ గురించి మాట్లాడుకున్నాం. ఆ సంభాషణ మాతృస్వామ్య వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థగా మారుతున్న సందర్భంలోనిది. అత్త గార్గికి చెప్పిన మాటలు గుర్తున్నాయనుకుంటా. 'అక్కడే మహిళపై పురుషుని పెత్తనం మొదలయింది' అని కదూ నువ్వన్నది. అంతేకాదు 'బ్రాహ్మణ, క్షత్రియ కుట్ర అక్కడే మొదలైంది' అని కదూ మాట్లాడుకుంది.
ఆరోజు గార్గి ఇంకా మాట్లాడి ఉంటే తన తల తెగిపడి ఉండేది. గార్గి అత్త అన్నట్టే, 'యజ్ఞవల్కుడి బ్రహ్మతేజస్సు వల్ల మాత్రం కాదు. ప్రపంచంలో నిశ్శబ్దంగా మొండెం నుండి వేరు చేయబడుతున్న తలల్లాగే'. ఆ రోజు గార్గి ఎందుకు ఆగిందో కానీ బతికి పోయింది. ఇప్పుడు గార్గిలు ఉన్నారు. ప్రశ్నిస్తున్నారు. యజ్ఞవల్కుడిలా 'శిరస్సు నేల రాలుతుంది' అనట్లేదు. 'దీని మానం తియ్యాలి అంటున్నారు. యోనిలో సీసాలు జొప్పియ్యాలి అంటున్నారు.' నడుస్తున్న కాలంలో గార్గి ఇప్పుడు బరితెగించి మహిళ.
కోరి వచ్చిన మహిళ ముక్కు, చెవులు తమ్ముడితో కోయించిన 'దుర్మార్గుడు' ఈ దేశంలో దేవుడు. పెండ్లాన్ని అడవికి పంపిన వాడు. అటువంటి వాడే భర్తగా రావాలి అని సగటు మహిళ కోరిక. అది వింటుంటే జుగుప్సాగా ఉంది. స్నానం చేస్తున్న అమ్మాయిల బట్టలు ఎత్తుకపోయి చెట్టు మీద కూచొని, నగ్నంగా నడచివస్తే తప్ప బట్టలు ఇవ్వను అన్నవాడూ దేవుడే. మారువేషంలో పోయి అహల్యను బలాత్కరించిన వాడు దేవుళ్ళకి అధిపతి. అయ్య చెప్పిండని తల్లిని నరికినవాడు ఆదర్శప్రాయుడు. గుర్రంతో భార్యని రమింపచేయడం ఒక యాగం. నడి బజారులో పందిరి వేసి మరి రమించడమూ యాగమే. ఇందులో మొగుడికి స్వర్గంలో దేవవేశ్యల ప్రాప్తం కలుగుతుంది. ఎందుకో భార్యకే యే ప్రాప్తం లేదు. ఇవి పురాణాలుగా, ఇతిహాసాలుగా చదువుకున్న దేశం మహిళల పట్ల ఎట్లా ఉంటుందో ఊహించడం కష్టం యేమి కాదు. మనం కళ్ళముందు జరుగుతున్నదే. ''ఆడ'ది కదా! ఎట్లా రాత్రి తిరుగుతుంది. తిరిగితే, ఇట్లాంటి బట్టలు వేసుకుంటే రేపులు జరగవా!' ఇవి మనం రోజూ వింటున్న మాటలే. 'బరితెగించింది. విచ్చలవిడిది. బిచ్.' ఇవి ఇప్పుడు గార్గి సర్వనామాలు.
గార్గి మొదలు ఇప్పటిదాకా మహిళ ఓడించబడుతూనే ఉన్నది. అయినా తిరగబడుతూనే ఉన్నది. 'ఈ మోసాన్ని ద్వేషించడానికి మానవహృదయం మనకిక ప్రొత్సాహమివ్వదా?' అని గార్గి అడిగినట్లే అడుగుతూనే ఉన్నది. 'ఇస్తుందమ్మా! అదే నాకున్న ఆశల్లా.' అని అత్త ఇచ్చిన సమాధానం 108 తరాలుగా (రాహుల్ రాసిననాటికి) ఇంకా ఆశగానే ఉన్నది.