Monday, April 23, 2018

శీర్షిక అవసరం లేని కవిత


చిదిమేయబడింది
వికసిస్తున్న పువ్వొకటి
ఇది మొదలా? పోనీ చివరా?

తాను అడిగింది...
కుంకుమ పూల సోయగాన్ని చూడాలని
తెల్లని మంచు నేలపై తిరగాడాలని
'తెల్లని మంచు నేల ఏనాడో ఎర్రబారింది' అన్నాను

'కునాన్ పోష్పోరా నుండి ఆసిఫా దాకా
వయా దండకారణ్యం' జరిగిన హత్యాచారాలన్ని
తన కళ్లముందు కదలాడాయి అన్నది.

'గుడిలో ఎంత దారుణం' అన్నారట ఎవరో!
'దారుణాలకు పుట్టుకే గుడి,
కావాలంటే మాతంగుల్ని అడుగు' అని
జవాబిచ్చిందంట....

ఇప్పుడిక కన్నీళ్లు కార్చడం కాదు
కత్తుల వాడకం నేర్పాలి
ఇంటిముందు ఆడుకోవడంతో పాటు
వేటకుక్కలను వేటాడటం నేర్పాలి అంటో
మాటల బుల్లెట్ల వర్షం అయింది

ఆసిఫా స్మృతిలో #విరసం నిర్వహించిన కవిసభ కోసం రాసింది

Saturday, April 21, 2018

Another Sleepless Night 3

రోడ్డు పక్కన సేద తీరుతో కార్లు
వాటిపై విశ్రమిస్తో కుక్కలు
...........

మెయిన్ రోడ్డుపై మలిగిపోయిన దీపాలు
దూరంగా సెల్ టవర్ పై ఎర్ర బుగ్గ
రాత్రి తిరగడం ఈ దేశంలో నిషిద్ధం నాయన అన్నట్లు
............

తడి చెత్తను, పొడి చెత్తను వేరుచేస్తూ కార్మికులు
మంచికి, చెడుకు మధ్య విభజన రేఖను గీస్తున్న స్వాప్నికులు
...........

రాత్రికి నిట్టాడు నేనే అంటూ
ఒంటరిగా నిలబడ్డ చాయ్ దుకాణం
రాత్రి బతుకులకు స్వాంతన
.............

తిరిగి రాగానే బుక్ షెల్ఫ్ పై రోహింటన్ మిస్ట్రీ
ఇకనైనా పూర్తి చేస్తావా లేదా అన్నట్లు......

ప్రేమలేఖ 7

మళ్ళీ ఒక నిద్రలేని రాత్రి గడిపి, ఉదయాన్నే పడుకుందాం అనుకుంటుండగా మార్నింగ్ కాఫీలా రూమి పలకరింపు.’నీ లోపలి అలల శబ్దాల్ని విను’ అంటూ. కొన్నిసార్లు నేనే సంద్రమయ్యాక, లోపలి అలలు తీరాన్ని తాకాలని, చేరాలని ఎంత ఎగిసిపడతాయి. అలలు ఎదలో రేగే భావాలయితే, తీరం నీవు. చెప్పలేదు కదూ... మొన్న ‘సంద్ర’ ప్రచురితం అయింది. సంసారిక పాఠకుల కోసం రోమాన్స్ ని, భావుకతని ఎడిట్ చేయగా, సంద్రకాస్త మడుగై ప్రచురితం అయింది. బేటుని ఎవరో అడిగారట. ‘సంద్ర’ నీపైన రాసిందా అని. దానికి తాను ‘కాదు. మా డాడీ , మా మమ్మిపై రాసిండు’ అన్నదట. ‘కరక్టే చెప్పిన కదా డాడీ’ అని అన్నది. రాసిన సంద్ర నువ్ కాకపోయినా. నువ్ మాత్రం ఎప్పటికి నా సంద్రానివే. మరి నేను? నిన్ను చేరేందుకు నదిని పట్టుకొని నిన్ను చేరిన పిల్ల కాలువని.

ఈ మధ్య లేఖ రాయక చాల రోజులైంది కదూ.ఏమని రాయమంటావు? దేని గురించి రాయమంటావు? ‘కనుగుడ్లు కన్నీరై స్రవించాయి’ అన్నాడో కవి. గడుస్తున్న నిద్రలేని రాత్రులు అట్లాగే ఉన్నాయి. ఈ దేశం భారత్ నుండి బలత్కారత్ గా పేరు మార్చుకున్నది. పసిపిల్లల దేహాలు కళ్ళముందు కదలాడుతుంటే కన్నీరు కాలువలై పారుతుంది. మనం ఎన్నిసార్లు అనుకున్నాం కాశ్మీర్ కి పోవాలని, కుంకుమ పూల పరిమళాన్ని, యాపిల్ హొటల సోయగాల్ని, మంచుకొండల అందాల్ని, పచ్చిక బయల్లను చూడాలని. కానీ ఎక్కడ చూసిన రక్తం మడుగులు ఉంటాయి అని అనుకోలేదు. కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ మాయమైన వాళ్ళు ఎందరో!? ‘మీకు మీ వాళ్ళు చనిపోతే శవాలన్నా ఇస్తారు. మా వాళ్ళు ఉన్నారో, చనిపోయారో తెలియకుండా బతుకుతున్నాం.’ అని అన్నా కాశ్మీర్ తల్లి మాటలకి ఎంత కరిగిపోయాం. మనం చూడాలనుకున్నా, పోవాలనుకున్నా, అస్వాదించాలనుకున్నా వాటిని చూసి, ఆస్వాదించి, ఆడీ, పాడిన ఓ పాపా మదొంమాదానికి చిధ్రం అయింది. ఆ పాపా గురించి రాద్దామంటే కవిత్వం కాదు కదా. పదాలు దొరకట్లేదు. అక్షరాలూ పొందట్లేదు.

‘స్వేచ్చ కోసం పోరాడే ప్రజలు, స్వేచ్చ అంటే ఏంటో తెలియకుండా హిట్లర్ లాంటి వాళ్ళను గెలిపించుకుంటారు.’ అన్నాడు విల్ హెల్మ్ రైక్ తన ‘లిసన్ లిటిల్ మ్యాన్’లో. ఇక్కడ అదే జరిగింది అనిపిస్తుంది. అయితే, జార్జ్ ఆర్వెల్ అన్నట్లు ‘ఉద్యమాలు విఫలం అయితే ఆ నేరం ప్రజలది కాదు. ఉద్యమకారులదే.’ అన్న వాక్యాలు గుర్తుకు వస్తాయి. అయినా మధ్య అతరగతి ‘స్వేచ్చ’కి పరిమితులున్నాయి. మధ్యలో ఉన్నారు కనుక వాళ్ళకి కింద ఉన్న వాళ్ళను చూసి సంతోషపడే బ్లడీ సాటిస్ఫక్షన్ ఉంది. అన్ని కులాలో, వర్గాల్లో ఉన్నా మధ్య తరగాత్రితో ఉన్న సమస్యే. పాలో ఫ్రేయిరి చెప్పినట్లు ‘సూపర్ వైజర్’ మనస్తత్వం కలిగిన వాళ్ళు కదా. తమపై జరుగుతున్న అణచివేతను ప్రతిఘటించలేక, తమ కింద వాళ్ళపై అదే అణచివేతను ప్రయోగించి సంతృప్తి పడతారు ఈ భద్ర జీవితాల బతుకుజీవులు. కొన్నిసార్లు అనిపిస్తుంది. వీళ్ళు వెన్నెముక లేని జీవులు అని. ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి అనుకూలంగా వచ్చే మెసేజెస్ ని పంపిస్తారు. దానికి వ్యతిరేఖంగా వచ్చే మెసేజెస్ ని పంపిస్తారు. అటువంటి వారిని చూస్తె ఒ వైపు కోపం, మరి వైపు జాలి కలుగుతుంది.

కొత్త కథ ఒకటి రాయడం అయిపొయింది. ఓ రోజు ఒక పిల్లా వచ్చి తన డిప్రెషన్ కి కారణమైన కథ చెప్పింది కదా! ఆ పిల్ల కథనే పేరు మార్చి రాసాను. నిజంగా మనసులో భావాల్ని పంచుకోవడానికి ఒక మనిషి లేకపోవడం ఎంత విషాదం. ఓ రోజు నీకు అంగారిక పూర్ణిమ కథ చెప్పిన గుర్తుందా? కథకి ఆ పేరే పెట్టా. అంగారిక అని. ‘నీ లోపలి అలల శబ్దాన్ని విను’ అని రూమి అన్నాడు గాని, అలల శబ్దాన్ని పంచుకొవాలనిపిస్తే? పంచుకోవడానికి ఓ మనిషి కూడా లేకపోతే? అది ఎంత ఘోరమైన విషాదం. అంగారిక పరిస్థితి అదే కదా. అంగారిక నిజానికి సర్వనామం. అనేకానేక మంది అనామకులకు ఈ అంగారిక ప్రతిక.

Tuesday, April 17, 2018

మనం స్నేహితుల్లా మొదలయ్యాం

అనేకమార్లు గాయపడి
మళ్ళి గాయపడేందుకు భయపడుతు
అప్పుడు ఇప్పుడు ఒకర్ని ఒకరు చూసుకునే
ఇద్దరు మిత్రులలానే మనం మొదలయ్యాం

మెల్లిగా మనం సుదూరపు నడకలు పంచుకోవడం మొదలెట్టాం
అంతేనా... మన మాటల్లో భావాల్ని పంచుకోవడము
అంతేనా.... మనిద్దరి మధ్య ఇష్టమూ పెరిగింది
అప్పుడు, మనిద్దరికీ ఏదో ప్రత్యేక బంధం ఉన్నట్లు తెలుసుకున్నాం

తీవ్రంగా గాయపడిన హృదయాలు
మళ్ళీ ప్రేమలో పడుతాయని అనుకోని ఉండవు
మళ్ళీ దొరుకుతుందేమోనని రహస్యంగా కాంక్షించింది
ఎవరో ఒకరు కాస్త మనశ్శాంతిని ఇస్తారనే

లోలోపల కోల్పోయిన ప్రేమను
దూర, విశాల ప్రాంతలంతా వెతికిన హృదయం.
ఏదో ఓ నక్షత్రపు తోవలో దొరకదా!
అని దూర దూరాలు తిరిగిన మనసు

నా కోరిక తీరే రోజు రానే వచ్చింది
నాకు మళ్ళీ ప్రేమ దొరికింది, అది నీవే
నా మనసులో కోల్పోయిన ఒక ముక్క
నువ్ నన్ను సంపూర్ణం చేసిన నా అందాల చుక్క

Alan W Jankowski కవిత' 'We Started As Friends'కి తెలుగు అనువాదం

వసంతం నుండి శిశిరం వైపు



వసంతం వాడిపోయింది
కడలెందుకో చిన్నబోయింది

ఆశలన్నీ చిగురించే వసంతం
కొత్తపొద్దుల వసంతం’
అందమైన వసంతం
పెనవేసుకున్న వసంతం
ఎందుకో వాడిపోయింది

అలలపై ఊయలుపిన కడలి
ముంచేస్తూ ఎగిరేస్తూ ఆడించిన కడలి
ఎందుకో చిన్నబోయింది

నిత్య శరత్కాలపు వెన్నెల
వెలుగులు పంచే వెన్నెల
దూరాలను దగ్గర చేసే వెన్నెల
ఎందుకో మౌనందాల్చింది

నా ఎదను తాకిన వాన చినుకులు
తన కన్నీళ్లు కాబోలు

(తవ్వకాల్లో దొరికిన పాత కవిత)

Saturday, April 14, 2018

చూపు

ఆమె  నవ్వుతూ చూసే చూపులో
అబ్సలుట్ మత్తు ఉంది
అయినా
ఆ రెప్పల మాటున
కనుగుడ్లకు ఆవల 
పోటెత్తేందుకు సిద్ధంగా 
ఓ సంద్రముంది

Friday, April 13, 2018

Another Sleepless Night 2

నిదురపోతున్న నగరం
నడిబొడ్డున సెంట్రీ కాస్తూ బుద్ధుడు
....................
మీ బద్దకాల బతుకులకు భరోసా
నేనంటూ రాత్రీ పగలోలే ఛాయ్ బిస్కట్
పర్సులో మరిన్ని కాసులుంటే
ఖీమా - రోటీ, పాయ - బన్
.......................
పగటి సమూహాల చెత్తను
ఎత్తిపోస్తూ రాత్రి కార్మికులు
........................
సగటు మనిషి జీవితంలాగా
మిణుకు మిణుకుమంటూ విద్యుత్ దీపాలు
.........................
ఈ దేశ చిత్రపటాన్ని
తమలో చూపుతూ గుంతల రోడ్లు
..........................
జీతమాంధ్యమేమో! 
'రేయ్ బండి తీయ్' అంటూ మామూళ్ల మావలు
...........................
'ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము
నిప్పులలో కరిగిపోయే' అంటూ ఎదలో గీతం
రవింద్ర భారతి దాటుతుండగా