Monday, March 12, 2018

ప్రేమలేఖ 2




నువ్వెళ్ళి పోయాక చాలాసార్లు గుర్తొచ్చావ్. ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. గుర్తురావడం ఏంటి?. నేనేదో నిన్ను మర్చిపోయినట్టు?!. గుర్తురావడం అంటే ఒక మనిషి గుర్తురావడం కాదు. పక్కన తోడు లేదని గుర్తుకురావడం. ఆవహించిన ఒంటరితనం నుండి బయటపడేందుకు ఒక అశ్వాసాన్ని కోరుకోవడం. ఎడారిలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఇసుక రేణువు అవుతాను కొన్నిసార్లు. పాలపుంతలో ఒంటరి నక్షత్రాన్ని. అడవిలో చెట్ల మధ్యన ఒంటరి మొక్కని. చిట్ట చివరి కొమ్మపై ఆకును. అట్లా ఉన్నపుడు గుర్తొస్తావ్. నువ్ పక్కన లేవని. కాస్త ముభావంగా కనిపించగానే గుండెకు హత్తుకునే నేస్తం లేదని. ఒడిలో తల పెట్టుకొని, వెంట్రుకలు నిమిరే మానవి ఇప్పుడు తోడు లేదని. నువ్ లేక కవిత్వం పాదం తెగిపడ్డ పదాలయింది. కథ వాక్యాల్లో ఇమడనంటుంది. నవల ముందుకే కదలట్లేదు. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. కొత్తగా ఏమి రాయవు అంటావ్. కలసిన ప్రతిసారి.

కన్నీరు ఆపుకోవడం విషాదమే. నీకు చెప్తే మొదట నవ్వుతావ్. మరికాసేపటికి జతకడతావ్. ఎందుకంటే ఏడ్చినా, ఓదార్చుకున్న మనమిద్దరమే. ఇద్దరం వేరని ఎన్నడూ అనుకోలేదు కదా. కానీ ఇవ్వాళ అలా కాదు. ఏడవలేను. ఏడ్చినా, ఓదార్చుకోలేను. కన్నీళ్లు దిగమింగుతుంటే, గొంతులోంచి మాట బయటకు రాట్లేదు. అయిన తప్పదు తనని ఓదార్చాలి. ఊకోబెట్టాలి. ముద్దు చెయ్యాలి. కంట్లోంచి నీరు దుఃఖంతో గాక పట్టరాని సంతోషంతో వచ్చేంతగా నవ్వించాలి. అప్పుడు గాని మన గువ్వపిల్ల తనలాగా ఉండదు.దానికి నీ నవ్వే వచ్చింది. ఎంత స్వచ్చంగా నవ్వుతుంది. దిల్ ఖోల్ కె. కానీ ఇయ్యాలెందుకో పాప కంట నీరు. ఒళ్ళో కూర్చొని, మెడ చుట్టూ చేతులు వేసి పొగిలి పొగిలి ఏడ్చింది బిడ్డా. తట్టుకోవడం చాలా కష్టమైంది. కాసేపయ్యాక వెళ్తా అంది. వద్దు. కాసేపు ఉండి వెళ్లమన్నా. ఆ మాట వినడం కోసమే అడిగినట్టుంది. వెంటనే హత్తుకుపోయింది. నేను ఓ కవిత రాసుకుంటుంటే, చదివిపెట్టు అని జిద్ చేసింది. పూర్తి కాలేదు అంటే వినదే. బహుశా నా మొండితనమే వచ్చినట్టుంది. తనకు వినిపించడం కోసమే పూర్తిచేశా. చదవడం అయిపోయాక 'ఇదిగో, నా గుండెను ఇస్తున్న తీసుకో' అంది. తరువాత సినిమా చూస్తుంటే 'ఇప్పుడు ఈ సినిమా అవసరమా! మళ్ళీ అమ్మను గుర్తుతెచ్చుకోవడానికా!' అంటూ ల్యాప్టాప్ మూసేసింది. 'హమారి అధూరి కహానీ' అని రాగయుక్తంగా పాడుతూ. నన్ను తిట్టాక కానీ శాంతపడలేదు. 

ఒక్క చోట సక్కగా ఉండదు కదా. పాదాలకు చక్రాలు వేసుకొని తిరిగి, తిరిగి బెడ్రూంలోని పుస్తకాలను తీసి హాల్ లో కుప్ప పోసింది. నా కవితల పుస్తకం తిరగేస్తూ 'ఆమ్లెట్ ఆకలవుతుంది. వేసిపెట్టవా!' అని అడిగింది. వేశాక, పూర్తిగా తినకుండా సగం నాకు వదిలేసింది. కాసేపటికి, నేను వచ్చిన పని అయిపోయింది. వెళ్ళాలి. నన్ను హాస్టల్ లో దింపిరా అంది. దింపనైతే దింపాను గానీ, తిరిగివస్తుంటే తన గురించిన తలపులే. ఇంత సున్నితమైనది. ఈ దుర్మార్గపు 'జనాల' మధ్య ఎట్లా బతుకుతుందా! అని. అంతలోనే చెంపలపై కన్నీరు. ఇప్పుడు నువ్వూ ఉంటే ఎంత బాగుంటుండూ. ఎంత నేను చెప్పినా,నువ్వు చెప్పినట్టు ఉంటుందా?. నువ్వేమో మా ఇద్దరికి Rapport బాగుంటుంది అంటావ్. ఎంత క్లోజ్ గా ఉన్నా, అన్ని నాతో చెప్పుకోలేదుగా. ఆ మాట తనతో అంటే ఒప్పుకోదు. 'అన్ని నీతో చెప్తా కదా. Crushల గురించి కూడా చెప్తా కదా' అంటుంది. మళ్ళీ తనే 'ఎహె పో, నీకు అర్థం కాదు. నేను అమ్మకే చెప్తా' అని ఎగిరిపోతుంది. 

ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏదో జల్దీ పూర్తి చేసి రారాదు. మేం వస్తామంటే. 'మీ ఇద్దరిని చూస్తే డిస్టర్బ్ అవుతా. రావద్దు' అంటావ్. నువ్ లేని లోటు ఇయ్యాలెందుకో చాలా ఎక్కువ అనిపించింది. కనీసం సెలవు పెట్టి అయిన రారాదు. లేకపోతే తననే నీ దగ్గరికి పంపనా. 

నువ్వు, నేను, తాను ముగ్గురం మూడు చోట్ల
ఈ త్రిభుజాన్ని కలిపే పాయింట్ కై ఎదురుచూస్తూ నేను
తనకే స్వంతం అనుకునే ప్రపంచంలో తాను
మా ఇద్దరి బాధ్యతను మోస్తూ ఎక్కడో దూరంగా నీవు
పాపం మన మంచం ఒక్కటే ముగ్గురి కోసం ఎదురుచూస్తూ ఒంటరిగా

11/03/18

ఆలోచన ఒక మహారణ్యం


జీవితం ఉద్యమాన్ని ప్రేమించే చోట
మరణం అమరత్వంగా పిలవబడే చోట
పోరు నినాదంలో వాళ్ళు
అమరుల స్థూపమై వాళ్ళు
భానుడి కిరణమై వాళ్ళు
ఎన్నెల సలువదనమై వాళ్ళు

మరణించేది వ్యక్తులే
శాఖోపశాఖలుగా
విస్తరిస్తున్న మహారణ్యం
వారి ఆశయం
వారి ఆలోచనలు

Sunday, March 11, 2018

కనుల సంభాషణ



కొన్ని నిశ్శబ్దాలు
కొన్ని మౌనాలు
అనేక పేరాల 
సంభాషణలు

కొన్నిసార్లు
అద్భుత కావ్యాలు
మరికొన్నిసార్లు
పురాస్మృతుల జ్ఞాపకాలు

ఎవరన్నారు
కనులు మాట్లాడవని
తల్లి స్తన్యం కుడుస్తూ
బిడ్డ కలిపే చూపు
ప్రేమ సౌందర్యపు సంభాషణ

అతడు/ఆమె
ఎదురుపడగానే
కళ్ళతో విసిరేనవ్వు
ఓ సంభాషణ

విడిపోతూ చూసే
విరహపు చూపు
ఓ విషాద గీతం

మాటలు కరువైనప్పుడల్లా
పదాలు తోచనపుడల్లా
జరిపేది కనుల సంభాషణనే కదా


కనులతో కనులు
జరిపే సంభాషణలు
రాస్తే మహాకావ్యం

.....

అమరుల దేహం ముందు
ఆగని కన్నీళ్లు
కనులు మాట్లాడే మాటలు
హృదయాన్ని వెంటబెట్టుకు వచ్చిన
పోరు నినాదాలు

Friday, March 9, 2018

ఎర్రబడ్డ తెల్లమల్లేలు



మల్లెలన్ని కలసి
కన్న ఓ కల
బాంబుల దాడిలో ధ్వంసమైంది

పువ్వులు గుత్తులుగా గాక
ఒంటరిగానే పూయాలని
అధికారిక గెజిట్ ప్రకటన

కల ఇప్పుడు
రాజద్రోహం

రాజు ఉన్నంత కాలం
రాచరికాన్ని కూల్చే
అరాచక ప్రకటన
ఓ ధిక్కార కల

మల్లెలిపుడు
నెత్తురోడుతున్న విషాద దృశ్యం
మల్లెలది
ధ్వంసమైన స్వప్నం
మల్లెల మధ్యదార
ఇప్పుడొక నెత్తుటి మడుగు

తీరని చమురు దాహంతో
మట్టికాళ్ళ మహారాక్షసి
దానికి దూపేసినప్పుడల్లా
రక్తపు పంపులయ్యే దేశాలు
ఇప్పుడు దేశాలకు దేశాలే
కఫన్ కప్పబడ్డ దేహాలు

మొన్న ఇరాక్
నిన్న లిబియా
నేడు సిరియా
రేపు....
.........నేను
లేదంటే
............నువ్వు


(విరసం నిర్వహించిన 'సిరియా సంఘీభావ కవిసమయం'లో రాసింది)

9/3/18
7.30 PM (SVK)

ప్రేమలేఖ 1



ఎన్ని ఉత్తరాలు రాస్తే, ఒక జవాబై పలకరించావ్. చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. రమ్మంటే ఏమో రావు. నన్ను అక్కడికి వద్దంటావ్. కొన్ని రోజులే అయినా యుగాలు గడిచినంత భారంగా గడుస్తున్నాయి రోజులు. కమ్మేస్తుంది. ఏదో తెలియని ఒంటరితనం. ఏవో పిచ్చి ఆలోచనలు. ఎక్కడికి వెళ్లాలనిపించట్లేదు. వెళ్లిన తొందరగానే వచ్చేస్తున్నా. ఈ పుస్తకాలు. కవిత్వం. అప్పుడప్పుడు కథలు. నవల ఒకటి మొదలుపెట్టాను. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఇట్లే ఉంటే పూర్తి చేస్తానా? అనిపిస్తుంది. 

చంద్రుడ్ని కమ్మేసిన మబ్బుల్లా. ఉదయాన్నే పొగమంచులా. నన్ను కమ్మేసిన ఈ ఒంటరితంలో ఒక యుద్ధమే చేస్తున్నాను. అంతర్ముఖ యుద్ధం. పెంజికటి యుద్ధం. ఎందుకోసం చేస్తున్నానో తెలియకుండానే యుద్ధం. నాలో నేను. నాతో నేను. యుద్ధంలోనూ ఒంటరితనమే. జనసంద్రంలోనూ ఒంటరిగానే. ఈ నిశ్శబ్ద యుద్ధంలో పుస్తకం ఒక స్వాంతన. కవిత్వం ఒక స్వాంతన. ఏంటో తెలియని ఒంటరితనం నుండి బయటపడేందుకు పుస్తకంలో మనుషులతో సంభాషణ. కవిత్వమై ఒక ఊహా ప్రపంచంతో సంభాషణ. కొన్నిసార్లు ఉపన్యాసమై, మరికొన్నిసార్లు నినాదమై ఎదుటి మనుషులతో సంభాషణ. ఈ సంభాషణల నుండి కాస్త విరామం తీసుకుంటానా. మళ్ళీ అదే ఒంటరితనం. ఈ ఒంటరి జీవికి తోడుగా ఉన్నానంటూ ఓ 'ముసలోడు'. ఆయనే లేకపోతే. ఏమో?!.

అసలెందుకీ ఒంటరితనం. ఆ ప్రశ్న ఎందుకో సమాధానం లేనిదిగా అనిపిస్తుంది. నిజంగా, అట్లా ఉంటాయా? ప్రశ్నలు. ఉండవని మనకు తెలుసు. నాకు బాగా తెలుసు అంటావ్. వేతకట్లెదేమో. సమాధానాన్ని. అందుకే ఆ ప్రశ్న, ప్రశ్నగానే ఉండిపోయింది. సమాధానం లేకుండా.

ఈ ఒంటరితనం నుండి స్వాంతన పుస్తకం అన్నా కదా. కవిత్వం చదువుతుంటే. రాబర్ట్ గ్రేవ్స్ (Robert Graves) రాసిన ఓ కవిత దొరికింది.

"She tells her love while half sleep,
In the dark hours,
With half-words wishperd low:
As Earth stirs in her winter sleep
And puts out grass and flowers
Despite the snow,
Despite the falling snow"

రాబర్ట్ 'She tells her love'అన్నాడు. అప్పుడు అనిపించింది. నువ్ మన ప్రేమను అలా చెప్తే ఎలా ఉంటుందా? అని. అచ్చంగా అలాగే కాకున్నా. ఇంకోలా అయినా. అప్పుడు రాసుకున్నా. ఈ కవితని.

''ఏదో ఓ వెన్నెల రాత్రి నేలను చీల్చుకు వచ్చే గరిక లాగా/ వికసించు పువ్వుల్లాగా నువ్ మారిపోయి/ వెన్నెల ఉన్నప్పుడు/ వెన్నెల వెలుగు మనపై పడుతూ ఉన్నప్పుడు/ మన కథని/ మన ప్రేమకథని/ నిదురకు దగ్గరవుతూ/ సన్నని గొంతులో చెబుతుంటే వింటూ నేను/ వింటూ, వింటూ/ చెబుతూ, చెబుతూ/ నిద్రలోకి మన ప్రయాణం"

ఎన్ని రోజులైంది. మన రాత్రుల్లో కవిత్వం ప్రవహించి. వెన్నెల్లో మనం జ్వలించి. 

Monday, March 5, 2018

మనమిక ఒకే దేహం



ఆకసాన్ని చూస్తూ నీవు
నీలో ఐక్యమవ్వాలని నేను
మనసులో మాట విన్నదేమో
లతల్లా మనల అల్లెసిన వెన్నెల

ఇప్పుడిక మనం
నరాల్ని పెనవేసుకున్న ఒకే దేహం

(సత్య సూఫీ గీసిన చిత్రం చూశాక)

Friday, March 2, 2018

కవిత్వం ఇప్పుడొక వేశ్య



అవకాశవాద కవుల చేతుల్లో
కవిత్వమా నువ్వొక వేశ్యవి

పంచలూ, శాలువాలూ, ఊరేగింపుల అరుపులు 
వెనుక దీనంగా నడుస్తోన్న కవిత్వమా
ఒకరోజు కళ్ళలో రక్తం చిమ్మి, తెల్లారిపోక ముందే 
తెల్లని వీర్యం చిందించి 
దేశం, భక్తీ, సంస్కృతీ , ధర్మమూ... 
అయ్యో..! నా కవిత్వమా తాంబూలమేసి 
తుపుక్కున ఉమ్మబడ్డావు కదే...

ఇప్పుడొక గాజు సీసాలో 
నిన్ను బంధిస్తాడు వాడు... మరో రోజు 
నీకు జంధ్యం వేసి, తీర్యక్ పుండ్రాలు గీసి 
దేశపు బోనులోకి వదిలి నీతో తైతక్కలాడిస్తాడు... 
మార్కెట్ రాంప్ పై నువ్వొక నిస్సహాయ మోడల్ వి.. 
పిల్లినడకలు నడిచీ, నడుములను ఊపీ
దూది పిర్రల మీద గుడ్డముక్కని చేశారు కదే నిన్నూ..

'కులం చిరకాలం ఉండాలండీ' అని
జంధ్యం సవరించుకు రాస్తున్న వాడే
'అమెరికాలో అంత రేసిజం ఏంటండి' అనే
కోకిల పలుకులు పలుకుతున్నాడు

పాకిస్తాన్ నాశనం కావాలని 
పూజలు చేస్తూనే
సిరియాపై కవిత్వమై కన్నీరవుతున్నాడు
'యుద్ధం ఏదైనా చనిపోయేది 
మనుషులే కదా' అంటే
'అయ్యో అది వేరండి, మీకు బొత్తిగా
దేశభక్తి లేదు' అంటూ
మాట మార్చే మేల్ ఎస్కార్ట్ వాడు

ఏడవకేడవకు. ఇప్పుడొక కొత్త పొద్దు వచ్చింది. 
ఇప్పుడు నడుస్తున్న కాలం
జంధ్యాలను తెంపి
ఇంటిముందు దండెంకట్టి
తునకల్ని ఎండేస్తున్న కాలం
కవిత్వపు 'జంధ్యాలను' 
తెంపేందుకు సాహిత్యమూ
కత్తులతోనే 'పెరియార్'లను
కంటున్న కాలం

2/3/18

నరేష్కుమార్ సూఫీతో కలసి